ఆధార్‌కు చట్టబద్ధతపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. అన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరేమీ కాదని తీర్పులో వెల్లడించింది. ప్రయివేట్ వ్యక్తులు, సంస్థలకు ఆధార్ సమాచారం ఇవ్వరాదని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఆధార్ వివరాల పేరిట ప్రజల నుంచి తీసుకున్న సమాచారం చాలా స్వల్పమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లను అనుసంధానం అక్కర్లేదని పేర్కొంది. మొబైల్ సంఖ్యకు ఆధార్ తప్పనిసరి చేస్తూ డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.
ఇక స్కూల్ అడ్మిషన్ల విషయంలో ఆధార్ పై స్పందిస్తూ, సెక్షన్ 7 కింద స్కూల్ అడ్మిషన్, విద్యార్థికిగానీ, అతని తల్లిదండ్రులకు గానీ దక్కే ప్రయోజనం ఏమీ కాదని, దీనివల్ల ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆధార్ లేదని స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడం నేరమని పేర్కొంది. సీబీఎస్ఈ, నీట్, యూజీసీ తదితరాలు ఆధార్ ను తప్పనిసరి చేయకుండా ఉండాల్సిందని పేర్కొంది.
మాజంలో బలహీన వర్గాల వారికి ఆధార్ ఓ గుర్తింపు అని వ్యాఖ్యానించింది. నకిలీ ఆధార్ సృష్టించడం సాధ్యంకాదని, కనీసమైన వ్యక్తిగత సమాచారం మాత్రమే ఆధార్ తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది.వ్యక్తిగత సమాచారం భద్రతపై స్పష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాల్లేకపోవడంతో ‘ఆధార్ అనుసంధానం’ తప్పనిసరి చేయొద్దంటూ సుప్రీంకోర్టులో 27 పిటిషన్లు దాఖలయ్యాయి. అధార్ అనుసంధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను స్వీకరించిన సుప్రీం కోర్టు గత జనవరిలో 38 రోజులపాటు ఐదుగురు సభ్యుల ధర్మాసనంతో విచారించింది. దీనిపై బుధవారం తీర్పును వెలువరించింది.
