గ్లోబల్ పరిస్థితుల కారణంగా బొగ్గు దిగుమతులపై ప్రభావం పడే అవకాశాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) దయానంద్… వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తగినంత బొగ్గు నిల్వలు ఉంచాలని సూచించారు.
విద్యుత్ సంస్థలు బొగ్గు లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, పోర్టులు మరియు రైల్వే శాఖలతో సమన్వయం చేసుకుని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ఆయన తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
పీక్ డిమాండ్ సమయంలో గ్రిడ్ స్థిరత్వం కోసం అన్ని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నడపాలని ఆయన ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్‌కు అవసరమైన దిగుమతి బొగ్గు అవసరాలను అంచనా వేసి, సరఫరా షెడ్యూల్‌ను త్వరగా ఖరారు చేయాలని సూచించారు. ఇదే సందర్భంగా, ఎపిజెన్‌కో సాధించిన రికార్డు స్థాయి 6,101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 5,730 మెగావాట్ల ఎక్స్-బస్ జనరేషన్‌పై ఆయన అభినందనలు తెలిపారు.
అదేవిధంగా ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ 2,400 మెగావాట్ల సామర్థ్యంలో 2,339 మెగావాట్ల ఉత్పత్తి సాధించి, 97.45 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించినందుకు ప్రశంసించారు. రాష్ట్రంలో వినియోగదారులకు చౌకగా విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని మార్గాలను పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు.
ఇక రాబోయే మాన్సూన్ సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగా లేకపోవచ్చని అంచనా ఉండటంతో, థర్మల్ పవర్‌పై ఆధారపడాల్సి వచ్చే అవకాశముందని విజయానంద్ తెలిపారు. డిమాండ్ పెరుగుదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక, వనరుల సమర్థ వినియోగం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
