ఏపీలో మున్సిపల్ ఎన్నికల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు కొనసాగుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే కూటమి పార్టీల నేతలకు ఈ మేరకు దిశా నిర్దేశం చేసారు. కాగా.. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ నిర్వహించాలని.. ఎప్పుడు నిర్వహణకు అనుకూలమనే అంశం పైన ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల దిశగా కీలక చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 123 మున్సిపల్ సంస్థలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ముందస్తు చర్యలు.. నిర్ణయాలు తీసుకోవాలని నిర్దేశించింది. కూటమి పార్టీల సీట్ల
లెక్కల పైన పార్టీల అధినేతలే నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. స్థానిక సంస్థల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. మూడు పార్టీలకు సీట్ల కేటాయింపు కత్తి మీద సాముగా మారే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. అటు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రతీ వార్డులో పార్టీ అభ్యర్ధి ఖచ్చితంగా పోటీలో ఉండాలని తేల్చి చెప్పారు. నియోజకవర్గ ఇంఛార్జ్ లకు బాధ్యతలను కేటాయించారు. ఈ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
గతంలో 100 పట్టణ స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. మరో 23 మునిసిపా లిటీలకు కోర్టు కేసుల కారణంగా జరుపలేదు. ఈ కేసులు ఉపసంహరింపజేసి వీటిలోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. వీలైనంత త్వరగా పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. దీంతో.. దసరా సమయంలోనే ఉగాది ఎన్నికల నిర్వహణ ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటి ఫలితాల ఆధారంగా సర్పంచ్, జెడ్పీ ఎన్నికల పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
