ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమంతుడు సినిమా చూశారు. అది కూడా 1200 రూపాయలు పెట్టి టిక్కట్ కొని మరీ చూశారు. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో జరిగింది. అక్కడ నూతనంగా నిర్మించిన వైస్ర్కీన్ థియేటర్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
అనంతరం టిక్కట్ కొనుక్కుని అందులో ఆడుతున్న శ్రీమంతుడు సినిమాని కొంతసేపు చూసి సేద తీరారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ఆర్టీసి సిబ్బంది కూడా ఈ సినిమా చూశారు. అనంతరం అక్కడే ఉన్న ఫుడ్ కోర్టును సిఎం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మండలంలోనూ వైఎస్టిడీ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు.
అందులో మినీ థియేటర్లతో పాటు ఫుడ్ కోర్టు, మీ సేవా, ఏటిఎం, సైబర్ కేఫ్ వంటివి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసి బస్టాండ్ లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాల డీన్ బి.పాండురంగారావును సిఎం సన్మానించారు. అలాగే గుడివాడ ఆర్టీసి డిపోలో పని చేస్తూ ఇటీవల మరణించిన కానిస్టేబుల్ కె.శ్రీనివాస రావు భార్య నాగపుష్పవతికి 10 లక్షల రూపాయల బీమా చెక్కును కూడా చంద్రబాబు నాయుడు అందజేశారు.
