ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయింది. ఉమ్మడి ఏపీ రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటుచేసుకోవాలి. అందులో భాగంగా ఎన్నికల అనంతరం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చేసిన తప్పిదాలు, ఆయన అక్రమాలు, రాజధాని ప్రాంతం ఎంపిక, రాజధాని ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలు వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాని కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పూసగుచ్చినట్టు ఓ పుస్తకం రాశారు. ‘ఎవరి రాజధాని అమరావతి?’ అంటూ ఓ పుస్తకం రచించి గురువారం (ఏప్రిల్ 5) విడుదల చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులు కలిసి ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. 112 పేజీల పుస్తకాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉన్నదున్నట్టు వాస్తవాలు, రాజధాని ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలు కృష్ణారావు కూలంకషంగా చర్చించారు.
రాజధాని ఎంపికలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమి ఉందో.. ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో.. ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉందో.. భవిష్యత్‌లో ఎలా తయారవుతుందో తదితర విషయాలు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వాస్తవ విషయాలు ప్రజల ముందుకు ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకంతో కృష్ణారావు పడడంతో రాష్ట్ర మంత్రులు, తెలుగు దేశం పార్టీ నాయకులు తల పట్టుకున్నారు.
ఇక ఐవైఆర్ కృష్ణారావుపై విమర్శలు ఎక్కుపెట్టారు. పుస్తకంలో ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సుజనా చౌదరి, కొందరు వ్యాపారవేత్తలు నడిపిన తతంగం అంతా చెప్పడంతో సంచలనం సృష్టిస్తోంది.
