ప్రొఫెసర్ కోదండరాం అంటే ఆయన తెలంగాణ కోసం తపించిన విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలూ లేవు. ఇప్పటికీ తెరాస తరఫున ఆయనను నిందిస్తున్న నాయకులు కూడా.. గతంలో ఆయన చిత్తశుద్ధిని పోరాటపటిమను తప్పుపట్టేవాళ్లు ఎంత మాత్రమూ కాదు. ఇప్పటికైనా సరే ఆయన రాజకీయంగా వేరొకరి చేతిలో కీలుబొమ్మలా మారి వారి అర్థం లేని ఆరోపణలకు తాను గళం ఇస్తున్నాడు తప్ప.. స్వతహాగా తన స్వబుద్ధితో తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధపడడం లేదనే ఆయనను నిందిస్తున్న వారు కూడా అనుకుంటున్నారు. అలాంటి కోదండరాంకు ఇప్పుడు తెరాస నాయకులు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణానికి, వాస్తవంగా ప్రజా సంక్షేమానికి ఏం చేస్తే బాగుంటుందో ప్రొఫసర్ కోదండరాం సలహాలు చెబితే ప్రభుత్వం నిరభ్యంతరంగా స్వీకరిస్తుందని తెరాస నాయకులు అంటున్నారు. తెరాస ఎంపీ బాల్క సుమన్ ఇదే విషయాన్ని చెబుతూన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు అయితే.. సలహాలుచెప్పడానికి కూడా.. దొంగనాటకాలు ఆడుతాయి. తమ వద్ద మంచిఆలోచన వచ్చినా సరే.. ఆపని తాలూకు మైలేజీ తమకు రాదు గనుక.. ప్రభుత్వానికి చెప్పడం అక్కర్లేదు అని డ్రామాలాడుతాయి. కానీ కోదండరాం రాజకీయ పార్టీగా కాకుండా, అలాంటి ఆశ లేకుండా, కేవలం బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే పనిచేస్తున్నప్పుడు, తనకు వచ్చిన ప్రతి మంచి ఆలోచనను ప్రభుత్వంతో పంచుకుంటే తప్పేముంది? అని తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కోదండరాం అంటే వారికింకా గౌరవం ఉన్నదిగనుకనే ప్రభుత్వం మీద నిందలు వేసినందుకు తిట్టినప్పటికీ.. ఇప్పటికీ ఆయనకు ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తున్నారని అనుకోవాలేమో. కోదండరాం కూడా పట్టుదలలకుపోకుండా వాస్తవంగా ప్రజాసంక్షేమమే కోరిక అయితే తన బుద్ధికి తోచిన సలహాలను ప్రభుత్వానికి చెప్పితే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.
