హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో పోలీసుల అమానుష చర్య వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక బ్యాంక్ ఉద్యోగిని స్టేషన్కు తీసుకెళ్లి, పోలీసులు లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు పోలీసులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.
కురుక్షేత్ర జిల్లా బన్గావ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను ప్రస్తుతం బోన్ క్యాన్సర్తో బాధపడుతూ కీమోథెరపీ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కీమోథెరపీ ప్రభావంతో అతని కాళ్లపై వెంట్రుకలు రాలిపోయాయి. ఈ నెలలో ఒకరోజు రాత్రి అతను ఇంటికి వెళ్తుండగా, ముఖానికి గుడ్డ కట్టుకున్నాడనే నెపంతో ఇద్దరు ఎస్సైలు, ఒక హోంగార్డు అతడిని అడ్డగించారు.
యువకుడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించిన సదరు పోలీసులు, అతడిని దారుణంగా కొట్టారు. అతడి కాళ్లను చూసి కీమోథెరపీ వల్ల వెంట్రుకలు లేవని గమనించి, అతడిని అమ్మాయిలా ఉందంటూ హేళన చేశారు. అనంతరం బట్టలు విప్పించి, విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, లైంగిక దాడికి పాల్పడ్డారు.
మరుసటి రోజు తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, యువకుడి కాలు విరగడమే కాకుండా, లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.
దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ, నిందితులైన ముగ్గురు పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేశారు. బాధితుడికి జరిగిన అన్యాయంపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
