భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మైనర్ బాలిక మృత శిశువుకు జన్మనిచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాల్వంచలోని ఓ పరీక్షా కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి హాజరైంది.
పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత అస్వస్థతగా ఉందని చెప్పి ఇన్విజిలేటర్ అనుమతితో టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే చాలా సేపు తిరిగి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఇన్విజిలేటర్ టాయ్‌లెట్ వద్దకు వెళ్లి చూడగా, బాలిక నెమ్మదిగా బయటకు వస్తూ కనిపించింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలగడంతో సిబ్బంది వివరాలు ఆరా తీశారు.
తర్వాత మరుగుదొడ్డిని పరిశీలించగా బాత్రూం బేసిన్‌లో మృత శిశువు పడి ఉండటం గమనించారు. ఈ ఘటనతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. పరువు పోతుందనే భయంతో ఎవరికీ తెలియకుండా శిశువును బేసిన్‌లో దాచినట్లు బాలిక తెలిపినట్టు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన సమాజంలో బాలికల భద్రత, అవగాహన, మానసిక మద్దతు అవసరంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
