Thursday, May 30, 2024
- Advertisement -

దుకాణాలు సర్దుకుంటున్న నాయకులు

- Advertisement -

తెలంగాణలో ఇక ముందు ప్రతిపక్షమే ఉండదా..? వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్, కార్యకర్తల బలం ఉన్నదనుకున్న తెలుగుదేశం పార్టీలు మూటాముల్లె సద్దుకోవాల్సిందేనా… ? పరిస్ధితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసిపోయింది. ఇక రేవంత్ రెడ్డి ఒక్కేరే మిగిలారు. ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ప్రధాన కార్యకర్తలు, కొద్దిగా మిగిలిన ప్రజాప్రతినిధులు కారు ఎక్కేశారు. దీంతో పార్టీని ఎలా బలోపేతం చేయాలో తెలియక.. ఇక్కడ దుకాణం మూసేయలేక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నానా యాతనలు పడుతున్నారు. మరోవైపు ఇలాంటి పరిస్ధితే కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోంది.

ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకులు గంపగుత్తగా టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిలో నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే, సిపిఐకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరు జిల్లాను శాసించగల నాయకులు. వీరి చేరికతో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే. ఇక కాంగ్రెస్ కు ఎన్ని సంవత్సారాలో ఇంచుమించు అన్ని సంవత్సరాల పాటు పార్టీలో నీడలా ఉన్న కాకా తనయులు వివేక్, వినోద్ ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. వీరిని చేరకుండా చేసేందుకు పార్టీ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే. ఇక వామపక్షాల వి‍షయానికి వస్తే తెలంగాణలో వారి బలమున్న ఖమ్మం కోటలో టిఆర్ఎస్ పాగా వేసింది.

దీంతో తెలంగాణలో వామపక్షాల పాత్ర ముగిసినట్లే. సమైక్య రాష్ట్రంలో అంతో ఇంతో పట్టు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఇక్కడి వారు అడ్డుకున్నారు. ఆ పార్టీ కూడా తమకు తెలంగాణలో స్ధానం ఉండదని నిర్ణయించుకుని ఇటు వైపు చూడడం లేదు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. స్వయంక్రతాపరాధంగా తెలుగుదేశం పార్టీ, నాయకత్వ లోపంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతోంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఇక టిఆర్ఎస్ తప్ప మరో పార్టీ మిగిలేలా లేదు. భవిష్యత్ లో జరిగే ఎన్నికలు కూడా ఏకపక్షంగా జరుగుతాయనడానికి ఇది నిదర్శనం అవుతుందా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -