Sunday, May 12, 2024
- Advertisement -

టీడీపీ సీనియ‌ర్ నేత గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడు క‌న్నుమూత‌…

- Advertisement -

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. రెండు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరవాత 2.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

మూడు నెలల కిందటే ముద్దుకృష్ణమ గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. గాలి మరణంతో ఆయన కుటంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు టీడీపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముద్దుకృష్ణమ మరణం పార్టీకి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి పలు ఉన్నతమైన పదవులు చేపట్టిన ముద్దుకృష్ణమనాయుడు 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జన్మించారు. జి.రామానాయుడు, రాజమ్మ దంపతులు ముద్దుకృష్ణమ తల్లిదండ్రులు. బీఎస్సీ, ఎంఏతో పాటు లా పూర్తిచేసిన ముద్దుకృష్ణమ.. స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

గాలి ముద్దుకృష్ణమ నాయుడు అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన, గుంటూరు జిల్లా పెదనందిపాడు కాలేజీలో అధ్యాపకుడిగా ఉంటూ.. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన పిలుపు అందుకుని రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటినుంచి ఆయన ఎన్నడూ వెనక్కి తిరిగిచూసుకునే పరిస్థితి రాలేదు. ఎన్టీఆర్ హయాంలోనే ఆయన మంత్రిగా కూడా సేవలందించారు.

విద్యా, అటవీ, ఉన్నత విద్య శాఖలను అప్పట్లో పర్యవేక్షించారు. చిత్తూరుజిల్లా నుంచి అప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే ప్రధాన అధికార కేంద్రంగా ఒక్క వెలుగు వెలిగారు. చంద్రబాబునాయుడుకు పోటాపోటీగా అధికార కేంద్రంగా ఆయన ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుకు మంత్రిపదవి లేని రోజుల్లోనూ ముద్దు మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబు చేతుల్లోకి రావడం, ఎన్టీఆర్ మరణంతో ముద్దుకృష్ణమ రాజకీయ జీవితం తిరగబడింది.

పుత్తూరు నియోజకవర్గం నుంచి ముద్దుకృష్ణమనాయుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డులకెక్కారు. 1984లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన గాలి.. 1987లో అటవీశాఖ, 1994లో ఉన్నత విద్యా శాఖలను నిర్వర్తించారు. ఆ తరవాత తెలుగుదేశంతో విభేధించి కాంగ్రెస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2008లో టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో పుత్తూరు నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఆయన పార్థీవ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -