Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా.. హైద‌రాబాద్‌లోనే అధినేత‌లు

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టం విడిపోయి.. నాలుగేళ్లు గ‌డిచిపోయింది. విడిపోయిన ఏడాదికే చంద్ర‌బాబు త‌న ప్ర‌భుత్వంతో స‌హా సొంత రాష్ట్ర రాజ‌ధానికి త‌ర‌లివ‌చ్చేశారు. పేరుకు ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానే అయినా.. హైద‌రాబాద్‌లోనే ఉంటే పక్క రాష్ట్రంలో ఉండి పాలించేలా ఉందంటూ చంద్ర‌బాబు అమ‌రావ‌తికి మారిపోయారు. మిగ‌తా యంత్రంగామంతా నెమ్మ‌దిగా చంద్ర‌బాబు వెంటే మ‌రో ఏడాదిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చేసింది. జ‌నం కూడా ప‌క్క రాష్ట్రంలో ఉంటూ పాలిస్తామంటే ఊరుకునే ప‌రిస్థితి లేదు. హైద‌రాబాద్‌లోనే ఉంటే.. అక్క‌డికి ప్ర‌తిసారీ వెళ్తూ ప‌న్న‌లన్నీ తెలంగాణ‌కు కుడుతూ ఉండాల్సిన ఖ‌ర్మ ఏంట‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ తలెత్తింది. అయితే.. ఇప్ప‌టికీ వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాలేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ‌లో ఓ ఇంటినీ ఈ మ‌ధ్యే తీసుకుని.. గృహ ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ.. అక్క‌డికి వ‌చ్చింది లేదు. ఎప్పుడో ఒక‌టీ అరా రోజులు ఉండి మ‌ళ్లీ హైద‌రాబాద్‌కే వెళ్లిపోతున్నాడు. భార్య అన్నాలెజ్నోవా, పిల్లలు, బంధువులు అంతా హైద‌రాబాద్‌లో ఉండ‌డంతో ప‌వ‌న్ ఇక్క‌డికి వ‌చ్చినా మ‌ళ్లీ రాత్రి విమానానికి భాగ్య‌న‌గ‌ర బాట ప‌డుతున్నారు. ప‌వ‌న్ బ‌స్సు యాత్ర నిర్విరామంగా చేప‌డ‌తానంటూ.. ఇచ్చాపురం నుంచి ప్రారంభించి.. ఉత్త‌రాంధ్ర‌తో స‌రిపెట్టారు. మ‌ళ్లీ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ప్రారంభిస్తామ‌ని తాజాగా ప్ర‌క‌టించారు. బ‌స్సు యాత్ర‌లు, ప‌బ్లిక్ మీటింగ్‌లు, కార్య‌క్ర‌మాల్లో ప‌వ‌న్ పాల్గొన‌డానికి రావ‌డం.. తిరిగి హైద‌రాబాద్‌కు వెళ్లిపోవ‌డం జ‌రుగుతోంది. తాజాగా ఆగ‌స్టు 2న జాతీయ‌ప‌తాక రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య‌కు సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్ మాదాపూర్‌లోని జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మంలోనే నివాళి అర్పించారు. విజ‌య‌వాడ‌కు చెందిన పింగ‌ళి వెంక‌య్య‌కు క‌నీసం ఇక్క‌డికొచ్చి నివాళి అర్పిస్తే.. బాగుండేద‌నే విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. పైగా జ‌న‌సేన పార్టీకి సంబంధించి తాజాగా ప‌క్ష ప‌త్రిక శ‌త‌ఘ్నిని సైతం ఇక్క‌డి నుంచే విడుద‌ల చేశారు. పార్టీ క‌ర‌దీపిక‌నూ హైద‌రాబాద్‌లోనే విడుద‌ల చేశారు.

! జ‌గ‌న్‌దీ అదే ప‌రిస్థితి..
వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి సైతం పూర్తిస్థాయిలో ఇళ్లు, కార్యాల‌యం రాజ‌ధానిలో లేదు. మంగ‌ళ‌గిరి ద‌గ్గ‌ర నిర్మాణం చేప‌డుతున్న‌ప్ప‌టికీ.. అది ఎన్నిక‌ల స‌మ‌యానికి అందుబాటులోనికి వ‌చ్చే అవ‌కాశం క‌న్పిస్తోంది. దీంతో ప్ర‌స్తుతం జ‌గ‌న్ రాష్ట్రంలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో పాల్గొంటూ గురువారం హైద‌రాబాద్‌కు వెళ్లిపోయి.. మ‌ళ్లీ శ‌నివారం ఉద‌యం వ‌స్తున్నారు. పార్టీకి సంబంధించి ఏ కార్య‌క‌లాపాల‌పై చ‌ర్చించాల‌న్నా.. హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్ కేంద్రంగానే జ‌రుపుతున్నారు. ప్ర‌జాసంకల్ప‌యాత్ర ముగిసిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ పూర్తిస్థాయిలో ఇక్క‌డే ఉంటారా.. లేక హైద‌రాబాద్ నుంచి వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడ‌తారా అనేది చూడాలి. ఎన్నిక‌లు మ‌రో ఆరు నెల‌ల్లోనే జ‌రిగే అవ‌కాశం ఉన్నా.. రెండు కీల‌క పార్టీల అధినేత‌లు ఇంకా హైద‌రాబాద్‌ను విడిచిపెట్టి రాక‌పోవ‌డం వారికి న‌ష్టం క‌లిగించే ప‌రిణామ‌మే. దీనినే తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నిక‌ల అస్ర్తంగా చేసుకున్నా.. ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే అనేక వేదిక‌ల‌పై చంద్ర‌బాబు.. ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఎన్నిక‌ల వేళ ప‌క్క రాష్ట్రాల నుంచి సూట్‌కేసుల‌తో దిగేవారిని న‌మ్మొద్దంటూ తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇప్ప‌టికైనా.. ప‌వ‌న్‌, జ‌గ‌న్ త‌మ పంథాను మార్చి పూర్తిస్థాయిలో తాము ఇక్క‌డి వారిమేన‌నే న‌మ్మ‌కం క‌ల్పిస్తారో.. లేదో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -