ఆదివారం ఏపీలో మోదీ పర్యటన నేపథ్యంలో భాజాపా, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రధాని పర్యటనను భాజాపా విజయవంతం చేయాలని చూస్తుంటే…టీడీపీ మాత్రం అడ్డుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగానే రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని బాబు నిర్ణయించారు. బాబుపై భాజాపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఫైర్ అయ్యారు.
దొంగ దీక్షల పేరుతో బాబు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని..మేము మాత్రం మోదీ సభకు సొంత డబ్బులు కర్చుచేస్తున్నామన్నారు. చిల్లర సంఘాలతో మోదీ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని మండి పడ్డారు. మోదీ సభతో బాబు బండారం బయటపడుతుందన్నారు. రేపు హీరో ఏపీలో ఎంటర్ కాబోతున్నాడని …సినిమా క్లైమాక్స్‌లో హీరోనే విజయం సాధిస్తాడని పేర్కొంటూ మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు. నాలుగున్నర ఏళ్లలో డ్వాక్రా మహిళలకు ఎందుకు పసుపు, కుంకుమ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు హీరో ముసుగులో ఉన్న విలన్లు బయట పడతారని, అందుకే ప్రధాని వస్తుంటే ఆందోళన చెందుతున్నారని జీవీఎల్ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా చంద్రబాబు చేసిన నాలుగు పనులు చెప్పాలని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ గృహాలు, పోలవరం, కేంద్రం నిధులతో నిర్మితమౌతున్నాయని, చంద్రబాబు ప్రచారం ఎక్కువ.. పెర్ఫార్మెన్స్ తక్కువ అని జీవీఎల్ ఎద్దేవా చేసారు
