తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య వైఎస్సార్‌సీపీ అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కలగన్నది అస్సలు కుదరదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పోరాటం ఓట్ల కోసం అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో కలిసి పోటీ చేసే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. అవినీతి పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని చెప్పారు. అలాంటి వారిని బీజేపీ దగ్గరకు తీసుకోదని తెలిపారు. కేంద్రం ఆదేశిస్తే ఒక్క క్షణం కూడా తాను మంత్రి పదవిలో కొనసాగనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైఎస్సార్‌సీపీ కలుస్తాయనే వార్తల్లో నిజం లేదన్నారు. కేంద్రం ఏపీకి న్యాయం చేస్తోందని చెప్పారు.
