Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఆత్మ‌శాంతించాలంటే టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలి మోత్కుప‌ల్లి న‌ర‌శింహులు..

- Advertisement -

తెలంగాణా టీడీపీ సీనియ‌ర్‌నేత మోత్కుప‌ల్లి న‌ర‌శింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దివంగత ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో తన వంటి నేతలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పతనమైందన్న చెడ్డ పేరు రాకముందే నాయకులు స్పందించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ లో ఉన్న నాయకులంతా టీడీపీవారేనని గుర్తు చేసిన ఆయన, తెలంగాణ టీడీపీ విభాగాన్ని ఆ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గౌరవప్రదంగా ఉండాలంటే విలీనం ఒక్కటే మార్గమని, చంద్రబాబుకు తాను ఇచ్చే వ్యక్తిగత సలహా ఇదేనని, తనను అర్థం చేసుకోవాలని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించే నేతలు ఎవరూ లేరని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. పార్టీని బతికించుకొనేందుకు నేతలు ముందుకు రావడం లేదని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ 22వ, వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాకపోవడం పట్ల మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్ని పనులున్నా ఎన్టీఆర్ వర్ధంతి రోజున నివాళులర్పించేందుకు బాబు వస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడుతున్నాయని నర్సింహులు అభిప్రాయపడ్డారు.

సీనియర్ నేత అయిన మోత్కుపల్లి ప్రకటన తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీసింది. పార్టీలో మరో సంక్షోభానికి ఇది దారి తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -