Saturday, April 20, 2024
- Advertisement -

సాగర్‌ ఉప ఎన్నిక : కారు పార్టీకి సవాలే!

- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికలో పరాజయం, ఆ వెంటనే గ్రేటర్‌ ఎన్నికల్లోనూ కమలం అనూహ్యంగా పుంజుకోవడంతో అధికార టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగింది. పైకి కనిపించడం లేదుగానీ అంతర్గతంగా కారు పార్టీలో ఒకరకమైన కలవరపాటు మొదలైంది. ఎందుకంటే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. మరికొద్ది నెలల్లోనే అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈక్రమంలో దుబ్బాక మాదిరి నాగార్జున సాగర్‌లో ఫలితాలు తారుమారైతే అది తప్పక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక దుబ్బాకలో విజయం, జీహెచ్‌ఎంసీలో మెరుగైన ప్రదర్శనతో కాషాయపార్టీలో జోష్‌ కనిపిస్తుండగా.. గులాబీ దళం కాస్త స్తబ్దుగానే కనిపిస్తోంది. ఎందుకంటే దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బలహీనంగా ఉండటమే తమ ఓటమికి కారణమని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. నాగార్జున సాగర్‌లోనూ అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో టీఆర్‌ఎస్‌ను విజయ తీరాలకు చేర్చే సరైన అభ్యర్థి కానరావడం లేదు. నోముల కుటుంబానికి చెందిన వ్యక్తికి టికెట్‌ ఇస్తే వారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ఎంతమేర ఎదుర్కొంటారనే సందేహం నెలకొంది.

ఇక నాన్-లోకల్ అభ్యర్థికి టికెట్‌ ఇస్తే స్థానిక పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీంతో నాగార్జున సాగర్ బై ఎలెక్షన్‌ టీఆర్ఎస్‌ పెద్ద టాస్కుగానే పరిణమించిందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఏదేమైనా దుబ్బాక రిజల్ట్ మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు పార్టీ నాయకత్వం వ్యూహాలు రచించే పనిలో పడినట్టుగా తెలుస్తోంది. మరి ఈసారి కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో చూడాలి. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు కేసీఆర్‌ స్వయంగా ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -