సౌత్ ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా ‘దృశ్యం’ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఒక థియేటర్ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోలీసు వ్యవస్థతోనే ఎలా మైండ్ గేమ్ ఆడాడనే కాన్సెప్ట్‌తో వచ్చిన మొదటి రెండు భాగాలు (‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’) బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఆ క్రేజీ సిరీస్‌కు కొనసాగింపుగా.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) లీడ్ రోల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeethu Joseph) కాంబినేషన్లో వచ్చిన తాజా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ (Drishyam 3). థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా జూన్ 18 నుండి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూడో భాగం కథ విషయానికి వస్తే.. ‘దృశ్యం 2’ ఎక్కడైతే ముగిసిందో సరిగ్గా అక్కడి నుంచే ‘దృశ్యం 3’ కథ మొదలవుతుంది. వరుణ్ హత్య కేసును హైకోర్టు పూర్తిగా కొట్టేయడంతో జార్జ్‌కుట్టి కుటుంబానికి ఒక పెద్ద ఉపశమనం దొరుకుతుంది. ఆ చేదు గతాన్ని మర్చిపోయి వాళ్లంతా ప్రశాంతంగా బతకడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే జార్జ్.. తమ జీవితంలో జరిగిన కథనే ‘దృశ్యం’ పేరుతో సినిమాగా తీసి నిర్మాతగా భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటాడు. మరోవైపు తన పెద్ద కూతురు అంజు (అన్సీబా హాసన్)కు పెళ్లి చేయాలని జార్జ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటాడు.
అయితే.. కుదిరిన ప్రతి పెళ్లి సంబంధం చివరి నిమిషంలో అకస్మాత్తుగా ఆగిపోతుండటంతో జార్జ్కుట్టిలో అనుమానం మొదలవుతుంది. దీనిపై అతడు లోతుగా ఆరా తీయగా.. కొందరు పాత శత్రువులు తన కుమార్తెకు పెళ్లి కాకుండా చేయాలని, ఆమెను ఎలాగైనా జైలుకు పంపాలని ఒక పెద్ద కుట్రకు తెరలేపారని అర్థమవుతుంది. ఇంతకీ ఆ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? చనిపోయిన వరుణ్ కుటుంబానికి దీనికి ఉన్న లింక్ ఏంటి? జార్జ్‌ను దెబ్బకొట్టాలని చూస్తున్న పోలీసులు ఈ కొత్త కుట్రను తమకు అనుకూలంగా ఎలా వాడుకున్నారు? ఈ మూడోసారి కూడా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి ఎలాంటి సరికొత్త లీగల్ మైండ్ గేమ్ ఆడాడనేదే ఈ థ్రిల్లింగ్ సినిమా సస్పెన్స్ కథ.
