భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ వచ్చే నెలలో జరగబోయే శ్రీలంక పర్యటన కోసం భారత్ అండర్-19 వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పూర్తి పర్యటనలో మూడు వన్డే మ్యాచ్‌లు మరియు రెండు నాలుగు రోజుల (మల్టీ-డే) మ్యాచ్‌లు ఉంటాయి.
బ్యాటర్, వికెట్ కీపర్ అయిన అన్వయ్….నవంబర్ 2025లో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన వన్డే ట్రై-సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో ఇండియా-బి అండర్-19 తరఫున ఒక మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యారు.
ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో అన్వయ్ కర్ణాటక అండర్-19 జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు నడిపించారు. ఈ టోర్నమెంట్‌లో అన్వయ్ ఆరు ఇన్నింగ్స్‌లలో 55.00 సగటుతో 220 పరుగులు చేశాడు.
రాబోయే పర్యటనకు ఎంపిక చేసిన రెండు అండర్-19 జట్లకు మధ్యప్రదేశ్‌కు చెందిన యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా ఉత్తరాఖండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ లక్ష్య రాయ్‌చందానీ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. 17 ఏళ్ల రాయ్‌చందానీ అప్పటికే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్ధసెంచరీలు సాధించారు.
ఈ పర్యటన జూలై 4, 6 మరియు 9 తేదీల్లో హంబన్‌తోటలో స్థానిక సమయం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మూడు వన్డేలతో మొదలవుతుంది. మొదటి నాలుగు రోజుల మ్యాచ్ జూలై 13 నుండి 16 వరకు గాలేలో, రెండో మ్యాచ్ జూలై 20 నుండి 23 వరకు కొలంబోలో జరుగుతుంది.
అండర్-19 వన్డే జట్టు:
సాగర్ విర్క్, లక్ష్య రాయ్‌చందానీ (వైస్ కెప్టెన్), యశ్‌బర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వి.కె., అర్జున్ రాజ్‌పుత్, కుశాగ్ర ఓజా, రజత్ బఘేల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రావిడ్ (వికెట్ కీపర్), అన్మోల్‌జీత్ సింగ్, వుట్కూరి యశ్‌వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, షావిన్ వి, కావ్య పరేష్ పటేల్, మోహిత్ ఉల్వా, ఇషాన్ సూద్.
