Tuesday, May 14, 2024
- Advertisement -

రాధాకృష్ణా…… నువ్వు దేవుడు సామీ….. బాబు కోసం ఎంతకైనా దిగజారగలవ్

- Advertisement -

ఏది ఏమైనా రాధాకృష్ణ చాలా గ్రేట్. చాలా చాలా గ్రేట్. తెలుగు జర్నలిజం చరిత్రలో రాధాకృష్ణను మించిన భక్తుడు నభూతో నభవిష్యత్ అని చెప్పాలేమో. తనకంటూ విలువలూ, అభిప్రాయాలు, ఆత్మాభిమానం లాంటివి ఏమీ లేకుండా ఒక నాయకుడి కోసం సర్వస్వం ధారపోసేలా ఒక ఎడిటర్ స్థాయి వ్యక్తి దిగజారిపోవడం మామూలు విషయమా? అత్యంత నమ్మకంగా ఉండే సాటి నాయకులను కూడా పార్టీల అధినేతలు నమ్మలేని పరిస్థితి. కానీ ఆర్కేలాంటి ఎడిటర్‌ని మాత్రం ఎంతైనా నమ్మొచ్చు. వెన్నుపోటు రాజకీయంతో ఎదిగివచ్చిన చంద్రబాబు సాధారణంగా ఎవ్వరినీ నమ్మలేడు. కానీ రాధాకృష్ణను మాత్రం ఎంతైనా నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని ఈ రోజు మరోసారి అత్యున్నత స్థాయిలో నిలబెట్టుకున్నాడు ఆర్కే. వైకాపా అధినేత జగన్‌కి కూడా ఒక రాధాకృష్ణ దొరికితే బాగుండు అని వైకాపా అభిమానులు, నాయకులు ఫీలయ్యేలా చేశాడు.

ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నోటీసులు…… అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీసిన జగన్ అని రాసిన వార్త చదివాక అయితే రాధాకృష్ణకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఒక కంపెనీకి వైఎస్ భూములు ఇచ్చాడు. అనుమతులు ఇచ్చాడు. ఆ కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే జగన్‌పై రాజకీయ కక్ష్య సాధింపుల కోసం పెట్టిన కేసు (సోనియానే ఎదిరించినందుకే జగన్‌పై కేసులు అని చంద్రబాబు బహిరంగ సభలో ఒప్పుకున్నాడు)లో ఆ కంపెనీని కూడా ఇరికించారు. ఆ రకంగా లోకల్ రాజకీయ కేసుల్లో ఇరికించడంతో మా కంపెనీ నష్టపోయింది అనే కారణంతో నష్టపరిహారం చెల్లించాలని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆ కంపెనీ కేసు వేసింది. రాజకీయ అంశాలు తమ కంపెనీలకు నష్టం చేస్తున్నాయని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో ప్రధాని కార్యాలయానికి నోటీసులు కూడా చాలా సార్లు వచ్చాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఇలాంటివి సహజంగా జరిగేవే. కానీ వైఎస్ జగన్ దేశం పరువుతీశాడు, మోడీ ఇమేజ్ కూడా డ్యామేజ్ చేశాడు అన్న వాక్యాలు రాయడంలో బాబు వీరభక్తుడికి ఉండే కిక్కు ఎంతో ప్రత్యకంగా చెప్పాలా?

బాబుపై భక్తి, జగన్‌పై ద్వేషం కాదు……సమాజంలో అవినీతిపై యుద్ధం చేయాలన్న నిబద్ధతతో కూడిన జర్నలిజం అని రాధాకృష్ణ తన భజన తానే చేసుకోవడంలో సిద్ధహస్తుడు కాబట్టి……ఇప్పుడు ఆ మాటల్లో నిజాయితీ కూడా ఒకసారి చూద్దాం.

అవినీతి సొమ్ముతో వైకాపా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు కూడా బాబుకు సహకరించారు అన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని విజయసాయి ఘంటాపథంగా చెప్పాడు. విజయసాయిరెడ్డి సాక్ష్యాలు బయటపెట్టకముందే వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ చేసి మంత్రి కూడా అయిన ఆదినారాయణ రెడ్డి స్వయంగా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. ఒక ఐఎఎస్ మధ్యవర్తిత్వంలో ఆదినారాయణరెడ్డికి అవినీతి పంపకాలు ఎలా చేసుకోవాలో చంద్రబాబు వివరంగా చెప్పాడు. అంతకుముందు టిడిపిలో ఉన్న నాయకుడు….కొత్తగా చేరిన ఈ నాయకుడు 50-50 రేషియోలో పంచుకోవాలని చెప్పినప్పుడు ఒక ఐఎఎస్ స్థాయి అధికారి అక్కడే ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆదినారాయణరెడ్డి సవివరంగా చెప్పాడు. ఆ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది.

కానీ రాధాకృష్ణకు మాత్రం ఈ వీడియో కనిపించదు. అసలు ఒక మంత్రి స్థాయి వ్యక్తితో ఐఎఎస్ మధ్యవర్తిత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి పంపకాలు ఎలా ఉండాలి అని వివరించిన వీడియో రాధాకృష్ణకు వార్తగా అస్సలు కనిపించదు. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు. ఎన్టీఆర్ వెన్నుపోటు, ఓటుకు కోట్లు……..బాబు అక్రమ వ్యవహారం ఏదైనా సరే ……..సమస్త విశ్వప్రయోజనాల కోసం………అనంత కోటి దేవతలు సంకల్పించిన గొప్ప దైవ కార్యంలా కనిపిస్తుంది ఆర్కేకి. ఇప్పుడు కూడా అలానే కనిపించింది. అందుకే బాబు అవినీతి గురించి, ఆదినారాయణరెడ్డి వీడియో సాక్ష్యం గురించి ఏమీ రాయలేదు. కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్ పన్నుతున్న కుట్రగా మాత్రం భలే వక్రీకరించాడు. ఐఎఎస్ అధికారుల మనోబలం దెబ్బతీయడం, చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడం……..అబ్బో జగన్‌ని అతిపెద్ద కుట్రదారుగా…….ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు అహర్నిశలూ కష్టపడి చేస్తున్న అభివృద్ధి యజ్ఙాన్ని అడ్డుకుంటున్న వాడిగా చిత్రీకరించడానికి తన అనైతిక జర్నలిజం విద్యలన్నీ ప్రదర్శించాడు ఆర్కే. బాబుపై అభిమానంతో కళ్ళు మూసుకునిపోయినవాళ్ళకు భలే పసందుగా అనిపించేలా వార్త అందించాడు ఆర్కే. అదేంటో మరి బాబు ఓటుకు కోట్లు వ్యవహారాన్ని ప్రస్తావించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇలానే మాట్లాడాడు.

అందుకే రాధాకృష్ణా…….నువ్వు దేవుడు సామీ……………వైఎస్ జగన్ కూడా ఈ పాదయాత్రలు, ప్రజల్లో తిరగడాలు, హోదా కోసం పోరాటాలు కాకుండా ముందుగా తన కోసం పనిచేసే ఒక రాధాకృష్ణను వెతకాలి. అలాంటి రాధాకృష్ణ దొరికితే ఆ తర్వాత ఎన్ని అక్రమాలు చేసినా, అవినీతికి పాల్పడినా అస్సలు ఫికర్ ఉండదు. ఇన్ని తిప్పలు కూడా ఉండవు. పదేళ్ళ ఆంధ్రజ్యోతి జర్నలిజాన్ని, తెలుగు రాజకీయాలను పరిశీలించిన ఎవరైనా వైఎస్ జగన్‌కి ముందుగా ఇవ్వాల్సిన సలహా ఇదే… ఏమంటారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -