2025 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో తన పేరు చెక్కించుకున్న జేకబ్ డఫీ, 31 ఏళ్ల వయసులో తన తొలి ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను ఆస్వాదిస్తున్నారు. దక్షిణ దీవికి చెందిన ఈ పేసర్ గత ఏడాది బ్లాక్ క్యాప్స్ తరఫున మొత్తం 81 వికెట్లు తీసి, సర్ రిచర్డ్ హాడ్లీ 40 ఏళ్లుగా నిలిపిన న్యూజిలాండ్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా అతను అదే జోరు కొనసాగిస్తూ ఆఫ్ఘానిస్థాన్, యూఏఈపై విజయాల్లో కీలక వికెట్లు సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అతని ప్రవేశం వెంటనే జరగలేదు. 26 ఏళ్ల వయసులోనే అతను డెబ్యూ చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎదురైన నిరీక్షణే తనను ఒత్తిడిని తట్టుకునే ఆటగాడిగా తీర్చిదిద్దిందని డఫీ పేర్కొన్నాడు.
జట్టులో ఉండాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అవకాశం రాలేదు. తరచుగా ఆడే అవకాశం దొరికినప్పుడు నేనూ ఆ స్థాయికి చెందినవాడినని నిరూపించుకోగలిగాను. నాకు 10-12 ఏళ్ల అనుభవం ఉంది. అది ఒత్తిడి సమయంలో ఎంతో ఉపయోగపడింది అని డఫీ ఐసీసీకి తెలిపాడు.
లంస్డెన్‌లో జన్మించిన డఫీ తన ఇద్దరు అన్నలతో ఇంటి వెనుక ప్రాంగణంలోనే ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు అతను వరల్డ్ కప్‌తో పాటు ఆర్‌సీబీ తరఫున తన తొలి ఐపీఎల్ సీజన్‌ను కూడా పూర్తి చేయనున్నాడు. జోష్ హాజిల్‌వుడ్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాడు. వరల్డ్ కప్‌లను చూస్తూ పెరిగిన డఫీకి, ఇప్పుడు అదే వేదికపై ఆడటం కల నెరవేరినట్టే అనిపిస్తోందని పేర్కొన్నాడు.
