Tuesday, May 14, 2024
- Advertisement -

వాహ్…. విరాట్… ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత గొప్ప నాయకుడిగా….

- Advertisement -

భారత క్రికెట్‌కి పట్టుదలగా పోరాడడం నేర్పించింది కపిల్ దేవ్. ఆ తర్వాత దూకుడుగా, ఆత్మవిశ్వాసంతో పోరాడడం నేర్పించింది సౌరవ్ గంగూలీ. అయితే ఆ ఇద్దరు మేటి కెప్టెన్స్‌తో పాటు ఇతర ఏ కెప్టెన్ కూడా ఇండియిాను ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా నిలపడంలో సక్సెస్ అవ్వలేకపోయారు. వరల్డ్ కప్పులు గెలవడాలు, నంబర్ ఒన్ ర్యాంక్‌లో నిలబడడాలు జరిగినా ఒక వెస్టిండీస్‌లాగా, ఒక ఆస్ట్రేలియాలాగా దశాబ్ధాలపాటు ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యాన్ని చూపించడంలో మాత్రం ఇండియన్ క్రికెట్ టీం ఎప్పుడూ సక్సెస్ అయింది లేదు. గెలుపు, ఓటములు, బలాలు, బలహీనతల మిశ్రమంగా ….అలా అలా సాగుతూ ఉండేది ఇండియన్ క్రికెట్ టీం పయనం. అయితే ఇప్పుడు విరాట్ మాత్రం ఆ గత చరిత్రను తిరగరాస్తున్నాడు. విజయాల్లో గత రికార్డ్స్ అన్నింటినీ వేగంగా అధిగమిస్తున్నాడు. ఇక టెస్ట్‌లు డ్రా అయినప్పుడు, ఓటములలో కూడా హీరోయిజం చూపించడం విరాట్ మాత్రమే చూపిస్తున్న స్పెషాలిటీ. ఇంతకుముందు ఏ భారత్ కెప్టెన్ కూడా ఈ స్థాయిలో ధైర్యం చేయలేకపోయారు. గంగూలీకంటే ఇంకా చాలా ఎక్కువగా…..ఆస్ట్రేలియన్స్ స్థాయి కంటే ఎక్కువగా విరాట్ ఆత్మవిశ్వాసం, దూకుడు ఉంది.

శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చివరి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మేన్ రహానే అవుటయ్యే సమయానికి ఇండియా ఆధిక్యం 91 పరుగులు. ఇక ఆ తర్వాత వచ్చే బ్యాట్స్‌మేన్ అందరూ కూడా ఆధారపడదగినవారు అయితే కాదు. ఆ విషయాన్ని నిరూపిస్తూ వాళ్ళలో ఒక్కళ్ళు కూడా రెండంకెల స్కోర్ చేయకుండానే అవుటైపోతూ ఉన్నారు. మరోవైపు మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియాను ఘోరంగా దెబ్బతీసిన లక్మల్ ఫుల్ స్వింగులో ఉన్నాడు. అలాంటి సందర్భాల్లో ……మొదటి ఇన్నింగ్స్‌లో కూడా లంక బౌలింగ్ ముందు నిలబడలేకపోయిన నేపథ్యంలో ఏ ఇతర కెప్టెన్ క్రీజులో ఉన్నా కూడా సేఫ్‌గా ఆడి డ్రా చేసుకోవడం కోసమే ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్నది కోహ్లి. ‘నేను క్రీజులో ఉండి కూడా టీంని గెలిపించలేకోయిననాడు క్రికెట్ నుంచే వైదొలుగుతా’ అని చెప్పగల ఆత్మవిశ్వాసం కోహ్లి సొంతం. అందుకే టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ….అత్యంత క్లిష్టమైన సందర్భంలో …ఒక ఫేస్ పిచ్‌పై అది కూడా అప్పుడే కొత్త బంతి తీసుకున్న లక్మల్ లాంటి ఫేస్ బౌలర్స్ చెలరేగే ప్రయత్నం చేస్తుంటే కోహ్లి ఎదురు నిలిచాడు. అది కూడా అలా ఇలా కాదు. వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు. 98 పరుగుల దగ్గర లక్మల్ బౌలింగ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్ అయితే శ్రీలంక బౌలర్స్ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసేలా కనిపించింది.

ఆ తర్వాత ఫీల్డింగ్ టైంలో కూడా కోహ్లి ఎక్కడా తగ్గలేదు. ఓవర్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో లంకను ఆలౌట్ చేయగలమా? లేదా? అని ఆలోచించలేదు. తన బౌలింగ్ యూనిట్‌తో అత్యున్నత స్థాయిలో బౌలింగ్ దాడులు చేయించాడు. నాలుగు రోజులుగా టెస్ట్‌పై ఆధిపత్యం చూపించిన లంక టీం అంతా ఆ దెబ్బతో జావగారిపోయింది. డ్రా చేసుకోవడానికి నానా పాట్లూ పడాల్సి వచ్చింది. ఆట నియమాలను కూడా తుంగలో తొక్కుతూ …వాళ్ళ భయాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చేస్తూ పసికూనల్లా కనిపించారు లంక క్రికెటర్స్. మరోవైపు కోహ్లి మాత్రం దటీజ్ కోహ్లి అనిపించాడు. లంక చేతుల్లో దారుణంగా ఓడిపోవాల్సిన ఇండియాని సగర్వంగా తలెత్తుకునేలా చేయడంలో లంక ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తూ దాదాపు ఓడిపోయినంత పనిచేయడంలో కోహ్లి సూపర్ హీరోయిజం చాలా బాగా కనిపించింది. కెప్టెన్సీ తీసుకున్న మొదటి సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై….ఆస్ట్రేలియాకు ఇదే సినిమాకు చూపించాడు కోహ్లి. అయితే ఇప్పుడు ఇంకా పరిణతి చెందాడు. అందుకే క్రికెట్ మేధావులు కూడా రాబోయే దశాబ్ధ కాలాన్ని ఇండియా శాసిస్తుందని ….కోహ్లి ముందుండి నడిపిస్తాడని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత గొప్ప అథ్లెట్ అనిపించుకోవాలన్న కోహ్లి ఆశయం నెరవేరడంతో పాటు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత గొప్ప కెప్టెన్‌గా, బ్యాట్స్‌మేన్‌గా కోహ్లి నిలబడిపోతాడనడంలో సందేహం లేదు. కష్టే ఫలి అన్న సూత్రం కూడా కోహ్లికి అతికినట్టు సరిపోతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -