తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత వ్యవహారాన్ని వెనకేసుకురావడానికి తెలుగుదేశం నేతలు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుది తప్పేమీ లేదని వాదిస్తున్న తెలుగు తమ్ముళ్లు ఈ విషయంలో ఎంతకైనా తెగించి మాట్లాడుతున్నారు.
ఓటుకు నోటుతో తప్పేమి ఉంది? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ మాట మాట్లాడాడు!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దగ్గర నుంచి ఎవరూ కూడా ఓటుకు నోటు ఇవ్వకుండా గెలవలేదని..డబ్బు ఖర్చు పెట్టే గెలిచారని దివాకర్ రెడ్డి స్పష్టం చేశాడు. మరి ప్రజాస్వామ్యంలో ఎంపీ హోదాల్లో ఉన్నవారు ఇలా మాట్లాడటం విడ్డూరమే కదా! మరి జేసీనే అనుకొంటే.. ఇప్పుడు జూపూడి కూడా అదే మాట అన్నాడు.
రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారు? అని ప్రశ్నిస్తున్నాడీయన. ఓటుకు నోటు వ్యవహారం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు జూపూడీ ఇదే మాట మాట్లాడాడు. రాజకీయాల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవరు.. అని జూపూడీ చెప్పుకొచ్చాడు. మరి ఇదేంటి సార్.. డబ్బు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? అంటే..మళ్లీ ఈయన నీళ్లు నమిలాడు!
