తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలన్ని కేటీఆరే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు, SIRపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇక ఇప్పటికే పార్టీ డిజిటల్ సభ్యత్వాన్ని ప్రారంభించగా అనంతరం రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలను వేయనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ , ఇంఛార్జీలను ఫైనల్ చేయగా ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టి సారించారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన మెజార్టీ సీట్లు గ్రేటర్ హైదరాబాద్ నుండి వచ్చినవే.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించనున్నారట. అదికూడా వెనుకబడిన తరగతులకు (బీసీలకు) ప్రాతినిధ్యం వహించేలా ఒక కీలకమైన పదవిని సృష్టించాలని అధిష్ఠానం యోచిస్తోంది. కుటుంబ పార్టీ అనే ముద్రను చెరిపేయడంతో పాటు సామాజిక సమీకరణలపై తమకున్న బలమైన నిబద్ధతను నిరూపించుకోవడానికి మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తీసుకురావాలనే చర్చ నడుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల కాలంలోనే ఈ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కూడా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నేత కావడమే కాదు గ్రేటర్ హైదరాబాద్‌పై పట్టున్న నేత. ముఖ్యంగా యాదవ సామాజికవర్గంలో తలసానికి మంచి ఇమేజ్ కూడా ఉంది. అందుకే ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్లో మరో నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారన్న వార్తలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
