బ్రెజిల్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన కలకలం రేపుతోంది. వినోదం కోసం స్నేహితులతో కలిసి రోప్ జంప్ (Rope Jump) యాక్టివిటీకి వెళ్లిన 21 ఏళ్ల మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రెటాస్, నిర్వాహకుల ఘోరమైన నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సావో పాలోలోని ‘పాంటే డో ఎస్క్వెలేటో’ వంతెన మీద జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ నెల 13న మరియా తన స్నేహితులతో కలిసి ఆ వంతెన వద్దకు చేరుకుంది. అక్కడ రోప్ జంప్ చేసే క్రమంలో, ఆపరేటర్లు ఆమెను సేఫ్టీ హార్నెస్‌తో ప్లాట్‌ఫామ్ అంచుకు తీసుకెళ్లారు. అయితే, అక్కడే అసలు విషాదం మొదలైంది. ఆమెకు కట్టాల్సిన ప్రధాన సేఫ్టీ రోప్‌ను నిర్వాహకులు అసలు అటాచ్ చేయలేదు. పక్కనే ఉన్న ఆ తాడు కాయిల్స్‌లా ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోయింది. ఏమాత్రం జాగ్రత్త తీసుకోని ఆపరేటర్లు, మరియాను ఆ 40 మీటర్ల ఎత్తు నుండి లోతుల్లోకి నెట్టేశారు. ఆమె కిందకు దూకడం గమనించిన పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు ప్రమాదాన్ని పసిగట్టి అరిచినా, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రెజిలియన్ అధికారులు, వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యమే ఆమె ప్రాణాలను బలిగొందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, ఆ రోప్ జంప్ ఆపరేటర్లలో ఆరుగురిని వెంటనే అరెస్ట్ చేశారు. వారిపై ‘హోమిసైడ్ విత్ ఈవెంచువల్ ఇంటెంట్’ (నేరపూరిత నిర్లక్ష్యం వల్ల మరణం) కింద కేసులు నమోదు చేశారు.
ఒక సరదా యాక్టివిటీని నమ్ముకుని వచ్చిన యువతి, నిర్వాహకుల కళ్లుగప్పే తప్పు వల్ల ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సాహస క్రీడల పేరుతో జరుగుతున్న ఇలాంటి అనాలోచిత కార్యక్రమాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
