నవ్యాంధ్ర సాధన అంటున్నారు.. కొత్త రాజధాని రూపకల్పన అని అట్టహాసంగా ప్రకటించుకొంటున్నాడు… పర్యటనల మీద పర్యటనలు పెట్టుకొంటూ విదేశాలకు చక్కర్లు కొడుతున్నారు.. అదేంటి అంటే, పెట్టుబడులు సాధించడానికి.. పరిశ్రమలను పెట్టించడానికి అని ప్రకటించుకొంటున్నారు.
ఎలాగూ అనుకూల మీడియా ఉండనే ఉంది… ఇదంతా జరిగిపోతూనే ఉంది! మరి ఏడాది గడిచాకా సాధించింది ఏమిటి? అంటే శూన్యం అనుకోవాలి!
రాజధాని భూముల సేకరణ మీద చాలా కాలాన్ని గడిపేశారు. రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భూముల పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. వ్యవసాయ భూములను అలా స్వాధీనం చేసుకొని ఇప్పటి వరకూ సాధించింది ఏమిటి? ఒక శిలా ఫలకం వేశారు. రాజధాని భూమి పూజ చేశారు. నిర్మాణం మొదలైందని అన్నారు! అంతే.. ఆ తర్వాత మాత్రం ఈ అంశంపై కదిలింది.. మెదిలింది ఏమీ లేదు!
ఇక గత నెల అంతా చంద్రబాబు పదవిలో ఉంటాడా? ఆయన పదవి ఊడుతుందా? అనేదే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో నమోదైన ఓటుకు నోటు స్కామ్ లో బాబు ముఖ్య పాత్రధారి అనే పేరు రావడం.. ఆయనకు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తుందని, అదుపులోకి తీసుకొంటుందనే వార్తలతోనే కాలం గడిచిపోయింది. అలా దినదినగండంలో గడిచిపోయాయి ఆ రోజులు. మరి ఆ తుపాలను అలా వెలిసింది అనుకొంటే.. అంతలోనే బాబు విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు.
ఇక ఏపీలో పాలన ఉందో లేదో అర్థం కావడం లేదు. రైతులు.. సామాన్య ప్రజలు అనేక రకాలుగా ఇక్కట్లు పడుతున్నారు. వారెవరినీ ప్రభుత్వం పట్టించుకొన్న పాపన పోలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని రోజుల పాలనకు చంద్రబాబుకు పడే మార్కులు చాలా తక్కువ. ఈ మార్కులతో ఆయన పాస్ పర్సెంటేజీని కూడా సంపాదించలేకపోతున్నాడు. విభజిత ఆంధ్రకు ముఖ్యమంత్రిగా ఆయన దారుణంగా ఫెయిలయ్యాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి!
