- Advertisement -

సాగునీరు కోసం ఛలో దెందులూరు!

- Advertisement -

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దెందులూరు నియోజకవర్గంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, సాగునీరు అందక రైతులు లబోదిబోమంటున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని కొవ్వలి, దోసపాడు, పోతునూరుతో పాటు ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. సాగునీరు లేక ఎండిపోయిన వరిపంట పొలాలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించి, వారి గోడును విన్నారు.

ఈ సందర్భంగా కొఠారు అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై, స్థానిక శాసనసభ్యుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి కొరత తీవ్రంగా ఉంది. కొవ్వలి గ్రామంలో రైతులు ఎంతో ఆశతో ఉడుపులు ఊడ్చిన చేలు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతున్నాయి. ఉదాహరణకు, పోలయ్య అనే కౌలు రైతు తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా, నీరు అందక చేనంతా ఎండిపోయింది. దీనివల్ల అతనికి లక్ష రూపాయలకు పైగా నష్టం వచ్చింది. గోదావరి నుంచి నీరు అందించాల్సిన కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతకాని ప్రభుత్వంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేవలం రివ్యూ మీటింగ్‌లకే పరిమితమయ్యారు. ‘రైతులకు నీరు ఇవ్వలేం’ అంటూ ఆయన చేతులెత్తేయడం సిగ్గుచేటు అని అబ్బయ్య చౌదరి ధ్వజమెత్తారు.

గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనను గుర్తుచేస్తూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. మేము ఎక్కడా సాగునీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాము. రైతులు ఇబ్బంది పడకుండా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ (కుడి కాలువ) నుంచి నీటిని డైవర్ట్ చేసి, కొప్పులవారి గూడెం లాకుల ద్వారా సాగునీరు అందించి వ్యవసాయాన్ని కాపాడాము. రైతులకు అండగా నిలబడటం ఒక్క వైఎస్సార్‌సీపీకే సాధ్యమైంది అని ఆయన పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వంపై మండిపడుతూ.. అప్పులు తెచ్చి కౌలు రైతులు సాగు చేస్తుంటే, వారికి నీరందించలేక చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. ఆఖరికి ఆకుమడికి కూడా నీరు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు పాలన అంటేనే రైతులకు ఉరి అనే పరిస్థితి మళ్లీ దాపురించింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన చింతమనేని ప్రభాకర్ గారి అనుభవం ఏమైంది? ఏ మొహం పెట్టుకుని రైతులకు నీరివ్వలేనని చెబుతున్నారు? అని ప్రశ్నించారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని హితవు పలికిన అబ్బయ్య చౌదరి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. “మేము రైతుల పక్షాన నిలబడి అడుగుతున్నాం. ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ లోగా దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లోని ఎండిపోతున్న పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులందరినీ సమీకరించి ‘ఛలో దెందులూరు’ కార్యక్రమానికి పిలుపునిస్తాం అని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -