మద్యం తాగడానికి డబ్బులు అడిగితే లేవని చెప్పిన పాపానికి ఓ వృద్ధుడిని దుండగుడు అందరూ చూస్తుండగానే గొడ్డలితో నరికి చంపేశాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో అత్యంత దారుణమైన ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు మృతదేహం నుండి తల, మొండెం వేరు చేసి పరారవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆసిఫాబాద్ మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన మాసండి సోమయ్య (65), తన భార్య కరుణాబాయి, కుమార్తెలతో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం తన కుమార్తెను రైలు ఎక్కించేందుకు స్టేషన్ వద్దకు వచ్చిన సోమయ్య, టీ తాగేందుకు రెబ్బెన బస్టాండ్ వైపు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో, కొత్తగూడకు చెందిన ఒక వ్యక్తి సోమయ్యను అడ్డగించి మద్యం కోసం రూ. 500 అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని సోమయ్య చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ దుండగుడు, తన వద్ద ఉన్న గొడ్డలితో సోమయ్య మెడపై బలంగా దాడి చేశాడు.
పట్టపగలే జనసంచారం ఉన్న రోడ్డుపైనే దుండగుడు అత్యంత కిరాతకంగా సోమయ్య తల, మొండెం వేరు చేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, వారినీ బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు బల్లార్షా వైపు వెళ్తున్న రైలు ఎక్కి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అప్రమత్తమై సమాచారం అందడంతో సిర్పూర్ (టి) రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్య కరుణాబాయి ఫిర్యాదు మేరకు రెబ్బెన పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నపాటి డబ్బుల కోసం నిండు ప్రాణాన్ని అత్యంత పాశవికంగా తీసేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, హత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
