తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కాంగ్రెస్ సర్కార్‌ని కూల్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేయగా దానిని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఖండించారు. తాజాగా దీనిపై స్పందించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరడానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారన్నారు. అయితే తాము ఎవరిని చేర్చుకునేందుకు సిద్ధంగా లేమన్నారు. టీఆర్, హరీశ్ రావు ఫ్రస్టేషన్ లో అసత్య ప్రచారం చేస్తున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. హామీలు నేరవేర్చనందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే పథకాలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం అదానీని ముఖ్యమంత్రి రేవంత్ కలిస్తే తప్పేంటని….బీఆర్ఎస్, బీజేపీ మైత్రి ప్రజలందరికీ తెలుసన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వేల కోట్లు గుమ్మిరించినా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోందన్నారు. శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ అప్పుల కుప్ప బయటపడిందని..ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు.
