హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కులు వణికిపోతున్నారు. నాలాలు, బఫర్ జోన్‌లలో ఇళ్లు,విల్లాల నిర్మించిన వారికి కంటిమీద కునుకు ఉండటం లేదు.అయితే ఇందులో చాలావరకు పేదలే ఉండటం, వారికి తెలియకుండానే కొన్ని సంవత్సరాల క్రితం అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాధితులు అంతా బీఆర్ఎస్ ఆఫీస్ తెలంగాణ భవన్‌కు క్యూ కడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హైడ్రా చుట్టూనే తిరుగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలను తమకు అనుకూలంగా మార్చుకుని బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేయగా బీజేపీ సైతం రంగంలోకి దిగింది. దీంతో హైడ్రా ఎఫెక్ట్…ఏ పార్టీ పొలిటికల్ మైలేజ్ పెంచుతుందా అన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది.
హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా ఉండాలంటే చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారు. ఇటీవలె హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు సిబ్బందిని మరింత విస్తృత అధికారాలను ఇచ్చారు. దీంతో హైడ్రా మరింత దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాలు సైతం నేలమట్టం చేశారు.
ముఖ్యంగా మూసీ నది తీరంలో పర్యాటక ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోండగా స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సర్వే కోసం వెళ్లిన అధికారులపై తిరగబడుతున్నారు స్థానిక ప్రజలు. దీంతో వారిని ఖాళీ చేయించడం సవాల్‌గా మారింది. వీరిపైకి హైడ్రా బుల్డోజర్ వెళితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సమస్యే.
దీనినే తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్,బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీశ్, సబితా పోరాటం చేస్తూంటే బీజేపీ తరపున ఈటల రంగంలోకి దిగారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన హైడ్రా… ఏ పార్టీని ముంచుతుందో, ఏ పార్టీకి మైలేజ్ తెస్తుందా అన్నదానికి మాత్రం కాలమే సమాధానం చెబుతుంది.
