ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలకు శ్రీకారం చుట్టారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్ లీక్ జరిగిందని, పోస్టుల అమ్మకాలు సాగాయని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం విద్యాదీవెన/ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని పార్టీ ప్రధానంగా కోరుతోంది.
వైసీపీ పిలుపునిచ్చిన నిరసన ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆందోళనలను భగ్నం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. బాపట్లలో ఉదయాన్నే వైసీపీ యువజన విభాగం నేతల ఇళ్లపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదని, శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ముందస్తు అరెస్టులను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పోలీసు బలగాలను ఉపయోగించి తమ గొంతు నొక్కలేరని..విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాయకుల అరెస్టులతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
