తమిళ సినీ ఇండస్ట్రీలో పొలిటికల్ ఎంట్రీ చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. ఇటీవల స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ కథానాయకుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు కూడా తమిళనాట ఇదే చర్చకు బలం చేకూరుస్తున్నాయి. ఇండస్ట్రీలో తాను సంపాదించుకున్న మంచి పేరును ఇకపై ప్రజా సేవకే పూర్తిగా అంకితం చేస్తానని ఆయన ప్రకటించడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇటీవల ఓ బహిరంగ సభలో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఇన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో నటుడిగా మీ అందరి ఆదరాభిమానాలతో మంచి పేరు తెచ్చుకున్నాను. మీరు నాకు ఇచ్చిన ఈ గౌరవానికి బదులుగా మీకు తిరిగి ఏదో మంచి చేయాలని భావిస్తున్నాను. ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు. ఎలాంటి అడ్డదారులు తొక్కకుండా, పూర్తిగా నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ఆ మార్గంలో నడుస్తూ అన్ని రంగాల్లోనూ మీకు ఎప్పుడూ అండగా నిలబడతాను’’ అని ఆయన స్పష్టం చేశారు. విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయని రాజకీయ, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలోనూ విశాల్ రాజకీయ ప్రవేశంపై అనేకసార్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 2024లో ఆయన పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరగడంతో అప్పట్లో ఆయనే స్వయంగా స్పందించారు. తమిళనాడు ప్రజలు తనను నటుడిగా, సామాజిక కార్యకర్తగా ఎంతో గౌరవిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని తెలిపారు. తన అభిమాన సంఘాలను కేవలం సాధారణ సేవలకే కాకుండా, పూర్తిస్థాయి ప్రజా సేవ కోసం ఉపయోగిస్తానని, దీని వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో ప్రజల నుంచి వచ్చే స్పందన, పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తే ప్రజల తరఫున నిలబడేందుకు తాను ఎప్పుడూ వెనకాడనని అప్పట్లో ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
