భారత్–ఓమాన్ బిజినెస్ ఫోరాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత 11 సంవత్సరాల్లో భారత్ చేపట్టిన విస్తృత ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించారు. సంస్కరణల ప్రయాణంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత పోటీ సామర్థ్యం గల మార్కెట్లలో ఒకటిగా ఎదిగిందని అన్నారు.
భారత్–ఓమాన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) ప్రాధాన్యతను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యంలో విశ్వాసాన్ని పెంచి, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సదస్సు భారత్–ఓమాన్ సంబంధాలకు కొత్త ఊపునిచ్చి, భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లలో భారత్ కేవలం విధానాలను మాత్రమే మార్చలేదు, తన ఆర్థిక డీఎన్‌ఏనే మార్చుకుంది. జీఎస్టీ దేశాన్ని ఒకే సమగ్ర మార్కెట్‌గా మార్చింది. ఇది ఆర్థిక క్రమశిక్షణను తీసుకొచ్చింది, పారదర్శకతను పెంచింది, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలపరిచింది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత్–ఓమాన్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ సంబంధాలు పరస్పర విశ్వాసం, స్నేహబంధాల పునాదిపై నిలబడ్డాయని తెలిపారు. మన సంబంధాలు విశ్వాసం పైన నిర్మితమయ్యాయి, స్నేహబలం తో ముందుకు సాగాయి. నేడు మన దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది కేవలం వేడుక మాత్రమే కాదు, శతాబ్దాల వారసత్వంతో భవిష్యత్తు వైపు అడుగు వేసే మైలురాయి అన్నారు.
