ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) ప్రస్తుత సీజన్‌లో ఎంఐ ఎమిరేట్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి మరో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎమిరేట్స్ కెప్టెన్ కిరోన్ పోలార్డ్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసి అభిమానులను అలరించాడు. వకార్ సలామ్‌కేల్ వేసిన ఒకే ఓవర్‌లో పోలార్డ్ ఏకంగా 30 పరుగులు బాదాడు.
ఈ మ్యాచ్‌తో ఎంఐ ఎమిరేట్స్ 10 మ్యాచ్‌ల్లో 7వ విజయాన్ని నమోదు చేసింది. లీగ్ దశను రెండో స్థానంలో ముగించింది. రన్ చేజ్‌లో పోలార్డ్ పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఈ సీజన్‌లో లీడింగ్ వికెట్‌టేకర్‌గా ఉన్న వకార్ సలామ్‌కేల్‌ను ఎదుర్కొంటూ పోలార్డ్ ఈ విధ్వంసం సృష్టించడం విశేషం.
ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఈ సంచలన ఘట్టం చోటుచేసుకుంది. చివరి ఆరు ఓవర్లలో 40 పరుగులు అవసరమైన సమయంలో, ఇంకా ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ మ్యాచ్ కాస్త కఠినంగా మారే అవకాశముంది. కానీ పోలార్డ్ వేరే ఆలోచనతో బరిలోకి దిగాడు. ఓవర్ తొలి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టిన పోలార్డ్, ఆపై రెండు పరుగులు తీసాడు. తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదుతూ ఆ ఓవర్‌లో మొత్తం 30 పరుగులు రాబట్టాడు.
ఈ ఒక్క ఓవర్‌తోనే మ్యాచ్ దిశ మారిపోయింది. ఎంఐ ఎమిరేట్స్ 123 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలోనే ఛేదించింది. పోలార్డ్ 31 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఓవర్ కారణంగా వకార్ సలామ్‌కేల్ గణాంకాలు పూర్తిగా చెడిపోయాయి. అంతకు ముందు అతను మూడు ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చాడు.
మ్యాచ్ విషయానికి వస్తే, దుబాయ్ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులకే పరిమితమైంది. ఎంఐ ఎమిరేట్స్ తరఫున అల్లా గజన్‌ఫర్ నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దుబాయ్ బ్యాట్స్‌మెన్లలో ఐదుగురు డబుల్ ఫిగర్స్ చేరినా, ఎవ్వరూ 25 పరుగులు దాటలేకపోయారు.
