విదేశీ దాడుల వల్ల పదే పదే ధ్వంసమై, తిరిగి పునర్నిర్మించబడిన గుజరాత్‌లోని సోమనాథ ఆలయం భారతీయ నాగరికత యొక్క అజేయ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు. సోమనాథ ఆలయంపై మొదటి దాడికి 1,000 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు మోదీ.
అనేక కష్టాలు, పోరాటాలను అధిగమిస్తూ ఘనంగా నిలిచిన సోమనాథ ఆలయం కన్నా మన నాగరికత యొక్క అచంచల శక్తికి మరొక మంచి ఉదాహరణ ఉండదు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి సోమనాథ ఆలయంపై మొదటి దాడికి 1,000 ఏళ్లు పూర్తవుతాయని, ఆ తర్వాత ఎన్నోసార్లు దాడులు జరిగినప్పటికీ ఈ ఆలయం అచంచలంగా నిలిచిందని ఆయన అన్నారు.
సోమనాథ గాథ అనేది భారతమాత సంతానమైన అనేకమంది వీరుల అటల ధైర్యానికి ప్రతీక. వారు మన సంస్కృతి, నాగరికతను కాపాడారు అని ప్రధాని చెప్పారు.
శతాబ్దాల పాటు జరిగిన దండయాత్రలు, వలస పాలనలో జరిగిన దోపిడీలను అధిగమించి, నేడు ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ఒక ప్రకాశవంతమైన కేంద్రంగా ఎదిగిందని ఆయన తెలిపారు.
మన విలువలు, ప్రజల సంకల్పమే నేడు భారత్‌ను ప్రపంచ దృష్టిలో కేంద్రంగా నిలిపాయి. ప్రపంచం భారత్‌ను ఆశతో, విశ్వాసంతో చూస్తోంది. మన నవీన యువతపై పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటోంది అని మోదీ అన్నారు. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, యోగా, ఆయుర్వేదం ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాయని చెప్పారు. ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు భారత్ నుంచే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
సోమనాథ ఆలయం 1024 ఏడీలో టర్కీ పాలకుడు మహ్మద్ గజనీ చేతిలో దాడికి గురై లూటీ చేయబడింది. స్వాతంత్ర్యం అనంతరం సోమనాథ ఆలయ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని గుర్తు చేశారు. 1947లో దీపావళి సమయంలో సోమనాథను సందర్శించిన సర్దార్ పటేల్ తీవ్రంగా చలించిపోయి, ఇక్కడ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథలో ఘనంగా ఆలయం ప్రారంభమై, అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆలయం ప్రారంభాన్ని సర్దార్ పటేల్ చూడలేకపోయారని ప్రధాని చెప్పారు.
1299 ఏడీలో అలావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి అలాఫ్ ఖాన్ ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేసి, అవశేషాలను ఢిల్లీకి తీసుకెళ్లాడు. అనంతరం హిందూ పాలకులు తిరిగి ఆలయాన్ని నిర్మించారు. 1394లో గుజరాత్ గవర్నర్ ముజఫర్ ఖాన్ ఆలయాన్ని మళ్లీ ధ్వంసం చేశాడు. 1459లో మహ్మద్ బెగడా (ముజఫర్ II) మరోసారి అపవిత్రం చేశాడు. 1669లో ఔరంగజేబు దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల ధ్వంసానికి ఆదేశిస్తూ సోమనాథను కూడా కూల్చివేయించాడు. 1702లో పూర్తిగా ధ్వంసం చేయాలని ఆదేశించి, 1706లో ఆలయాన్ని మసీదుగా మార్చాడు. 1783లో రాణి అహిల్యాబాయి హోల్కర్ ఆలయ పవిత్రతను గుర్తించి సమీపంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు. లింగాన్ని రక్షించేందుకు భూగర్భంలో రహస్యంగా ప్రతిష్ఠించారు.
