నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు కోర్టుల నుంచి ఊరట లభించింది. జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందే భవానీపురంలో నమోదైన మరో కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు కూడా బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండు కేసుల్లోనూ బెయిల్ లభించడంతో జోగి రమేష్ సోదరులు త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.
నకిలీ మద్యం తయారీ, సరఫరా ఆరోపణలతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పలువురిని అరెస్టు చేయగా, జోగి రమేష్ సోదరులపై కీలక ఆరోపణలు నమోదు చేశారు. విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ, ఆధారాల లోపం ఉందని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశాయి.
బెయిల్ మంజూరుతో జోగి కుటుంబంలో ఊరట వ్యక్తమవుతోంది. అయితే కేసు ఇంకా పూర్తిగా ముగియలేదని, దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోర్టు విధించిన షరతులు పాటిస్తూ విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామంతో నకిలీ మద్యం కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
