టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. పింఛన్ల పంపిణీ కోసం గ్రామానికి వెళ్లిన సమయంలో, స్థానికులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి తమ సమస్యలపై నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ప్రజలు ప్రశ్నించారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, వర్షం పడితే రోడ్లు పూర్తిగా దుర్గమంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు ఇళ్లముందే నిలుస్తోందని, ఈ సమస్యలపై పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు అమలు కాలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులను గ్రామంలోకి రానివ్వడం లేదని ఓ యువకుడిపై ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అరేయ్ సామి.. అధికారులను లోపలికి రానివ్వడం లేదు రా” అంటూ వ్యాఖ్యానించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మాటలతో ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగింది.
ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేయడం తగదని గ్రామస్థులు విమర్శించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
