బంగ్లాదేశ్‌లో ఎన్నికల పోలింగ్ నేడు జరగనున్న సంగతి తెలిసిందేఏ. పోలింగ్‌కు ఒక రోజు ముందు హిందూవ్యక్తి దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది. మౌల్వీబజార్ జిల్లాలో 28 ఏళ్ల హిందూ వ్యక్తి చేతులు, కాళ్లు కట్టివేసి, శరీరంపై లోతైన గాయాలతో మృతిచెందిన స్థితిలో కనుగొనబడ్డాడు. ఈ ఘటన ఎన్నికల ముందు మైనారిటీల భద్రతపై ఆందోళనలు రేకెత్తించింది.
మృతుడిని రతన్ సహూకర్గా గుర్తించారు. ఆయన చాంపా ప్రాంతంలోని టీ తోటల్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆయన శవాన్ని గుర్తించారు. ప్రారంభ సమాచారం ప్రకారం, ఆయన శరీరంపై లోతైన గాయాలు కనిపించాయి. చేతులు, కాళ్లు కట్టివేసిన స్థితిలో ఉండగా, శవాన్ని కనుగొన్న సమయంలో గాయాల నుంచి ఇంకా రక్తస్రావం జరుగుతున్నట్లు సమాచారం.
రతన్ సహచర కార్మికులు ఆయనను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. గాయాల స్వభావం మరియు చేతులు, కాళ్లు కట్టివేసి ఉండటం దురుద్దేశపూర్వక హత్యకు సూచనలని వారు పేర్కొన్నారు. ఈ హత్య ఎన్నికలకు సంబంధించినదా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అన్న కోణంలో విచారణ సాగుతోంది. మరణానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు లేదా పరిస్థితులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇటీవలే మైమెన్సింగ్ జిల్లాలో మరో హిందూ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యాడు. 62 ఏళ్ల సుశెన్ చంద్ర సర్కార్ అనే రైస్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేసి, దుకాణం లోపలే వదిలి షట్టర్ మూసివేసి పారిపోయారు. దుండగులు లక్షల రూపాయలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
