భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. తమిళనాడులోని తిరుప్పూర్ నుంచి ఎనిమిది మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఐఎస్‌ఐ మార్గదర్శకత్వంలో, అలాగే బంగ్లాదేశ్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు పెట్టుకుని భారత్‌లో పెద్ద ఎత్తున దాడి చేయాలనే యత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుప్పూర్‌లోని వివిధ గార్మెంట్ యూనిట్లలో పనిచేస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని రైలు ద్వారా ఢిల్లీకి తరలించారు. వారి వద్ద నుంచి అనేక మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన వారు:
మిజానుర్ రహ్మాన్, మహ్మద్ షబాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్. వీరిలో ఇద్దరిని పశ్చిమ బెంగాల్‌లో కూడా అరెస్ట్ చేశారు.తిరుప్పూర్‌లోని ఉతుకులి (2 మంది), పల్లడం (3 మంది), తిరుమురుగన్‌పూండి (1 వ్యక్తి) ప్రాంతాల్లో వీరిని పట్టుకున్నారు.
దర్యాప్తులో వీరు నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగించి తమ గుర్తింపును దాచుకున్నట్లు బయటపడింది. గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తూ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు మద్దతుగా పోస్టులు చేస్తూ, స్థానిక యువతను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు.
వారి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటి డేటా విశ్లేషణలో విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. సరిహద్దు దాటి నిధులు అందుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో “ఫ్రీ కాశ్మీర్” పోస్టర్లు అంటించడం వంటి అనుమానాస్పద కార్యకలాపాల్లో కూడా వీరు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
