మూసీ సుందరీకరణ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి, భూములను పెద్ద కాంట్రాక్టర్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కారణంగా ఇళ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను హరీశ్ రావు పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చామని తెలిపారు.
కేసీఆర్కు మధు పార్క్ అపార్ట్మెంట్తో ప్రత్యేక అనుబంధం ఉందని హరీశ్ రావు గుర్తుచేశారు. టీఆర్ఎస్ పాలసీ విజన్ డాక్యుమెంట్ ఇక్కడే రూపొందించారని, సీఎం అయ్యాక అపార్ట్మెంట్కు తాగునీటి సమస్య ఉంటే వెంటనే HMWS అధికారులను ఆదేశించి ప్రత్యేక పైప్లైన్ వేయించారని చెప్పారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో నీటి సరఫరా ప్రారంభించారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై స్పష్టమైన విధానం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టిందని, కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని మూసీలోకి మళ్లించేందుకు డీపీఆర్లు సిద్ధం చేశామని చెప్పారు. అప్పట్లో ఒక్క ఇల్లూ కూల్చాలనే ఆలోచన రాలేదని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్ట్ చేపట్టినా దాని వెనుక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ఉంటాయని హరీశ్ రావు ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఎల్టీపీఎస్ భూములు, ఫార్మాసిటీ భూముల విషయంలో కూడా ఇదే విధానమని అన్నారు. పేదలకు డబ్బుల్లేవని చెప్పే ప్రభుత్వం మెస్సీ మ్యాచ్లు, మిస్ వరల్డ్ పోటీలు, క్యాంపు కార్యాలయాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు. పేదల కోసం నిధులు లేవని చెప్పడం అన్యాయమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
