హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ధూల్‌పేట్, నాంపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అక్రమ మత్తు పదార్థాల తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ దాడుల్లో 2.622 కేజీల గంజాయితో తయారు చేసిన బంగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మూడు వేర్వేరు ప్రాంతాల్లో సమన్వయంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు, అక్రమంగా బంగ్ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. హోలీ పండుగ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బేగం బజార్, చుడి బజార్ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మత్తు పదార్థాలను సీజ్ చేసి ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
పండుగల సమయంలో ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని, మత్తు పదార్థాల విక్రయం, వినియోగం తీవ్ర శిక్షార్హమని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. నగరంలో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
