తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మందమర్రిలో ఒంటరిగా నివసిస్తున్న జక్కనబోయిన లక్ష్మి (80) అనే వృద్ధురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లక్ష్మి అనారోగ్యం లేదా వృద్ధాప్య కారణాలతో కింద పడిపోయి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అయితే ఈ ఘటనలో మరింత విషాదకర విషయం ఏమిటంటే, ఆమె పెంచుకుంటున్న రెండు పెంపుడు పిల్లులు ఆకలితో వృద్ధురాలి మృతదేహాన్ని పీక్కుతిన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఆమె చేతి భాగాన్ని పిల్లులు తినడంతో దృశ్యం చూసిన స్థానికులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.
రాత్రి సమయంలో ఆ ఇంట్లో ఎలాంటి వెలుతురు లేకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు ఇంటి వద్దకు వెళ్లారు. తలుపు తట్టి కూడా స్పందన లేకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా వృద్ధురాలు కిందపడిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. దగ్గరలోనే ఉన్న పిల్లులు ఆమె మృతదేహాన్ని కొరుకుతున్నట్లు గుర్తించారు.
తర్వాత వెంటనే స్థానికులు వృద్ధురాలి కుమారులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
