బిహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అనంతరం బిజెపి నేత సామ్రాట్ చౌదరిని సీఎంగా ఎన్నుకున్నారు. ఏప్రిల్ 15న బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన, ఆ పార్టీ తరపున బీహార్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న తొలి నేతగా రికార్డు సృష్టించనున్నారు.
బీహార్లో బిజెపికి చెందిన తొలి ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి. ఇన్నాళ్లు సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బిజెపి, ఇప్పుడు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడపబోతోంది. బిజెపి శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి పేరును ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ సమర్థించారు. కేంద్ర పరిశీలకుడిగా విచ్చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అధికారిక ప్రకటన చేశారు.
బీహార్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్, మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నేను బీహార్ ప్రజల కోసం ఎంతో పని చేశాను. ఇటీవల ముఖ్యమంత్రి పదవిని వదలాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించాను అని చెప్పారు నితీశ్ కుమార్.
ఈ సందర్భంగా నితీష్ కుమార్ వెంట సామ్రాట్ చౌదరి, జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, రాష్ట్ర మంత్రి విజయ్ చౌదరి తదితరులు ఉన్నారు. ఈ పరిణామంతో బీహార్లో నితీష్ సుదీర్ఘ పాలన ముగిసి, బిజెపి నేతృత్వంలోని కొత్త శకం ప్రారంభం కానుంది.
