మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్ సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ విస్తరణ ద్వారా సభలోని దాదాపు మూడింట ఒక వంతు, అంటే 273 స్థానాలను మహిళా చట్టసభ సభ్యులకు రిజర్వ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 850 స్థానాల్లో 815 రాష్ట్రాలకు, 35 కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించనున్నారు.
2023 చట్టం ప్రకారం కొత్త జనాభా గణన తర్వాతే రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే, అమలును వేగవంతం చేసేందుకు 2011 జనాభా గణన డేటానే ప్రాతిపదికగా తీసుకుని 2029 ఎన్నికల నాటికే దీనిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.ఈ బిల్లుపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది.
దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణలో సాధించిన ప్రగతి వల్ల నష్టపోకుండా ఉండేలా ‘ప్రో-రాటా’ పద్ధతిలో సీట్లను పెంచనున్నారు. దీనివల్ల ఏ రాష్ట్రం తన రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోదు.
ఎస్సీ (SC) స్థానాలు: 84 నుండి 126-136 కి పెరిగే అవకాశం.
ఎస్టీ (ST) స్థానాలు: 47 నుండి 70 కి పెరిగే అవకాశం.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని “21వ శతాబ్దపు అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటి”గా అభివర్ణించారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు.మహిళల సంక్షేమం దృష్ట్యా ఈ బిల్లును తీసుకువస్తున్నాము. దీనికి మద్దతు తెలపడం మనందరి సమిష్టి బాధ్యత అన్నారు.
దీనికి స్పందనగా ఖర్గే మాట్లాడుతూ…తమ పార్టీ అంతర్గతంగా చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు ఈ బిల్లు కాపీని అందించడంలో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ మార్పులు అమలు కావాలంటే పార్లమెంటులోని ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో రెండు ప్రధాన రాజ్యాంగ సవరణలు జరగాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే, 2029 లోక్ సభ ఎన్నికల్లో మనకు రికార్డు స్థాయిలో మహిళా ప్రతినిధులు కనిపించనున్నారు.
