పెళ్లిళ్లలో వధూవరులకు పూలదండలు వేయడం సాధారణం. కానీ రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో జరిగిన ఒక వివాహంలో మాత్రం అందరూ అవాక్కయ్యేలా వరుడికి ఏకంగా 100 అడుగుల పొడవైన నోట్ల దండను వేశారు. అల్లుడిపై తమకున్న ప్రేమను, తమ హోదాను చాటుకోవడానికి పెళ్లి కుమార్తె తరపు వారు ఈ వింత ఏర్పాట్లు చేశారు.
వరుడు వివాహ వేదిక వద్దకు రాగానే, అతడిని ఒక భవనంపైకి తీసుకెళ్లారు. అక్కడ కేవలం రూ. 500 నోట్లతో తయారు చేసిన 100 అడుగుల పొడవైన దండను అతడి మెడలో వేశారు. ఆ దండ ఎంత పొడవు ఉందంటే.. వరుడు భవనం పైన నిలబడితే, దండ చివరలు నేలను తాకుతున్నాయి.
రాజస్థాన్లోని మేవాత్ ప్రాంతంలో ఇలాంటి ఆచారాలు తరచుగా కనిపిస్తుంటాయి. తమ సామాజిక హోదాను, ఆర్థిక స్థితిని చాటుకోవడానికి పెళ్లిళ్లలో ఇలా నోట్లతో దండలు వేయడం ఇక్కడ ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ దండను తయారు చేయడానికి లక్షలాది రూపాయల విలువైన రూ. 500 నోట్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఈ వింత వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
