ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ‘రెడ్ బుక్’ అనే పదం ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ ‘రెడ్ బుక్’ సంస్కృతి తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బందులకు గురిచేసిన అధికారులను, వై నాట్ 175 అంటూ అరాచకాలు సృష్టించిన నాయకుల పేర్లను ఈ పుస్తకంలో పొందుపరిచామని కూటమి నేతలు చెబుతుండగా, ఇది కక్ష సాధింపు చర్యేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
చంద్రగిరి ఎప్పుడూ రాజకీయంగా అత్యంత కీలకమైన నియోజకవర్గం. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ఐదేళ్లలో చంద్రగిరిలో జరిగిన కొన్ని కీలక పరిణామాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చంద్రగిరిలో గతంలో పనిచేసిన కొందరు పోలీసులు మరియు రెవెన్యూ అధికారుల పేర్లు ‘రెడ్ బుక్’లో ఉన్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
దీనికి తోడు గత రెండేళ్లుగా వైసీపీ నేతలే టార్గెట్‌గా ముసుగు దాడులు జరుగుతున్నాయి. తాజాగా నియోజకవర్గంలోని మాధవనాయుడు అనే వైసీపీ నేతపై దాడి జరిగింది. నెంబర్ ప్లేట్ లేని వాహనాల్లో రావడం, నిమిషాల వ్యవధిలో దాడులకు పాల్పడటం, ఆ తర్వాత పారిపోవడం ఇదే తంతు గత రెండేళ్లుగా నియోజకవర్గంలో జరుగుతోంది. దీనిపై స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొనగా పోలీసులు దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ప్రభుత్వం ఈ తరహా ‘రెడ్ బుక్’ సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదని విమర్శిస్తున్నారు. మొత్తంగా చంద్రగిరి గడ్డపై ‘రెడ్ బుక్’ రాజకీయం ఇటు అధికారుల్లో, అటు రాజకీయ నాయకుల్లో పెను నిశ్శబ్దాన్ని, ఆందోళనను నింపుతోంది. రానున్న రోజుల్లో ఈ సెగలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో వేచి చూడాలి.
