- Advertisement -

మద్యం మత్తులో కొట్టుకున్న టీడీపీ నేతలు!

- Advertisement -

అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం నడిరోడ్డుపై పరస్పర దాడులకు దారితీసింది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ నగర్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) కి చెందిన రెండు గ్రూపులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు భీకరంగా దాడి చేసుకున్నారు.

రాజీవ్ నగర్ పరిసరాల్లో మద్యం మత్తులో ఉన్న ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. చూస్తుండగానే వివాదం పెద్దదై, ఇరుపక్షాల వారు కర్రలు, ఐరన్ రాడ్లు చేతబూని పరస్పరం దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై సినిమా ఫైటింగ్‌ను తలపించేలా ఒకరినొకరు విచక్షణారహితంగా బాదుకోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఈ ఊహించని పరిణామంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

ఈ ఘర్షణపై స్థానిక మహిళలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీలేరు పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు , గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వారు ఆరోపించారు. యువత, రాజకీయ నాయకులు ఇలాంటి వ్యసనాలకు బానిసై పట్టపగలే దాడులకు తెగబడుతున్నారని, స్థానికంగా రక్షణ కరువైందని ప్రజలు మండిపడుతున్నారు. వీటిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని వాపోయారు.

ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా రక్తసిక్తమైన క్షతగాత్రులను వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.మరోవైపు సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు గొడవకు దిగిన వారిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -