ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఒక ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూల్ గర్ల్స్ హాస్టల్లో అర్థరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న 16 మంది విద్యార్థినులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ షాకింగ్ సంఘటన కెన్యాలోని ‘ఉతుమిషి గర్ల్స్ బోర్డింగ్ స్కూల్’ (Utumishi Girls Boarding School) లో సంభవించింది. ప్రమాద సమయంలో బాలికలంతా గాఢ నిద్రలో ఉండటం.. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు ప్రాణాలు రక్షించుకునే అవకాశం లేకుండా పోయిందని స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ దారుణ ప్రమాదానికి సంబంధించిన వివరాలను కెన్యా దేశ విద్యాశాఖ మంత్రి జూలియస్ ఒగాంబా (Julius Ogamba) అధికారికంగా మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్ డార్మిటరీలో మంటలు చెలరేగిన ఈ ఘోర ప్రమాదంలో మరో 79 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో సదరు హాస్టల్ పెద్ద గదిలో సుమారు 220 మంది బాలికలు నిద్రిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు ప్రాథమికంగా గుర్తించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
అర్థరాత్రి మంటలు చెలరేగిన వెంటనే కెన్యా రెడ్ క్రాస్ (Kenyan Red Cross) బృందాలు.. అత్యవసర రెస్క్యూ సిబ్బంది.. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేస్తూనే లోపల చిక్కుకున్న విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఒళ్లంతా కాలిన గాయాలతో ఉన్న బాధితులను చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందాలు వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. స్కూల్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగిందనే భయంకరమైన వార్త తెలుసుకున్న వందలాది మంది తల్లిదండ్రులు.. బంధువులు తీవ్ర ఆందోళనతో రాత్రికి రాత్రే పాఠశాల గేట్ల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల క్షేమ సమాచారం తెలుసుకోవడం కోసం వారు ఎదురుచూడటంతో స్కూల్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత.. కన్నీటి వాతావరణం నెలకొంది.
కెన్యా అధ్యక్షుడు విలియం రుటో (William Ruto) ఈ దారుణ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన అమాయక విద్యార్థినుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
