- Advertisement -

కరెంట్ షాక్…ప్రీపెయిడ్ మీటర్లు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్యాలయాలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, వాటర్ వర్క్స్ వంటి సుమారు 34 వేలకు పైగా కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేస్తూ డిస్కాంలు (ముఖ్యంగా APSPDCL) ఉత్తర్వులు జారీ చేశాయి.

ఇకపై ప్రభుత్వ ఆఫీసులకు కూడా ముందే డబ్బులు కడితేనే కరెంట్ ఉంటుంది.బ్యాలెన్స్ అయిపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్ అవుతుంది. అయితే ఈ నిర్ణయం రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ కోణాన్ని సంతరించుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే ప్రతిపక్ష వైసీపీ మరియు ప్రజా సంఘాలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అధికార తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తోంది. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని చెప్తోంది. ఈ నిర్ణయంతో వివిధ ప్రభుత్వ శాఖలు డిస్కాంలకు బకాయిపడ్డ వేల కోట్ల రూపాయలు వసూలు అవుతుందని చెబుతున్నారు. అందుకే ప్రీపెయిడ్ విధానం వల్ల బకాయిల సమస్యే ఉండదు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల్లో (RDSS) భాగంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల రాష్ట్రానికి అదనంగా అప్పులు తీసుకునే వెసులుబాటు (GSDPలో 0.5% వరకు) లభిస్తుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు లేనప్పుడు కూడా ఫ్యాన్లు..ఏసీలు తిరుగుతూనే ఉంటాయి. ప్రీపెయిడ్ మీటర్ల వల్ల ఏ శాఖకు ఆ శాఖ నిధులు ముందే చెల్లించాలి కాబట్టి. విద్యుత్ దుబారా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు…నేడు అధికారంలోకి రాగానే అదే విధానాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తోంది. బ్యాలెన్స్ అయిపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్ అయ్యే సిస్టమ్ వల్ల ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మున్సిపల్ వాటర్ వర్క్స్‌లలో కరెంట్ పోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలతో మొదలైన ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ముసుగు.. రేపు పొద్దున సామాన్య ప్రజల ఇళ్లకు పాకుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధ్యతరగతి ఇళ్లలో రీఛార్జ్ చేసుకోకపోతే అర్ధరాత్రి కరెంట్ కట్ చేసే పరిస్థితి వస్తుందని…ఇది విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగమేనని జనం మండిపడుతున్నారు.ప్రభుత్వ ఆఫీసుల వరకు ఓకే అనుకున్నా…ఈ విధానం రేపు సామాన్యుల ఇళ్ల గుమ్మం తొక్కితే మాత్రం కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పేలా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -