సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం . పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున హాజరైనందుకు గాను ఆయనకు ప్రొఫెషనల్ ఫీజుల కింద రూ.44 లక్షలు చెల్లించేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేకంగా రెండు వేర్వేరు జీవోలను విడుదల చేసింది.
ఈ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పూర్తి వివరాలను వెల్లడించింది. మొత్తం రూ.44 లక్షల మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి జీవోలు ఇచ్చింది. ఇందులో ఒక కేసులో కోర్టుకు హాజరైనందుకు ప్రొఫెషనల్ ఫీజు క్లర్క్ ఫీజుతో కలిపి రూ.33 లక్షలు కేటాయించారు. మిగిలిన మరో కేసు నిమిత్తం రూ.11 లక్షలు చెల్లించేలా రెండో ఉత్తర్వును సిద్ధం చేశారు. గతంలో హైకోర్టులో ప్రభుత్వం తరఫున వివిధ క్రిమినల్ పిటిషన్లపై వాదనలు వినిపించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంపిన నివేదికల ఆధారంగా ఈ ఫీజులను ఖరారు చేశారు.
సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాకు చంద్రబాబుకు సుదీర్ఘ అనుబంధం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుతో పాటు అమరావతి భూముల కేసుల్లో చంద్రబాబు తరఫున లాయర్‌గా లూథ్రానే కోర్టుల్లో వాదనలు వినిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలకమైన న్యాయపరమైన బాధ్యతలను సిద్ధార్థ్ లూథ్రాకు అప్పగించారు.
ప్రస్తుత నిధులతో కలుపుకుంటే ఇప్పటివరకు సిద్ధార్థ్ లూథ్రాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజుల రూపంలో రూ.13 కోట్లకు పైగా చెల్లించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రజల సొమ్మును ఈ విధంగా లాయర్ల ఫీజుల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడంపై విపక్షాలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.


