తమిళనాడులో సినిమా రంగానికి, రాజకీయాలకు దశాబ్దాల కాలంగా విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత నుంచి నిన్నటి విజయ్ వరకూ ఎంతోమంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా, ప్రజా నాయకులుగా సేవ చేశారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజాను ధనుష్ రాజకీయ ఎంట్రీపై ప్రశ్నించగా, ఆయన ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమన్నారు. ‘‘రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుంది. భవిష్యత్తులో నా కుమారులు మాత్రమే కాదు, నా మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు’’ అని అన్నారు. దీంతో ఆయన సమాధానం ధనుష్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో సరికొత్త ఊహాగానాలకు తావిచ్చింది.
ఇదే వేదికపై తన కుటుంబ సినీ ప్రయాణాన్ని, పడిన కష్టాలను కస్తూరి రాజా గుర్తుచేసుకున్నారు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చిన తర్వాతే ఆ పేరు మార్చుకున్నాడని తెలిపారు. ‘‘విమానాశ్రయాల్లో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో మా అబ్బాయిని అందరూ ‘ధనుష్ కె. రాజా’ అని పిలుస్తుంటే నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపిస్తుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ తన 55వ సినిమాలో నటిస్తున్నారు.
