పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఒక డాక్టర్ అత్యంత అమానుషంగా ప్రవర్తించిన షాకింగ్ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ప్రాణాలు కాపాడాల్సిన చేతులతోనే, లంచం ఇవ్వలేదన్న కక్షతో ఒక అమాయక బాలిక కాలికి తీవ్ర గాయం చేశాడు. ఆసుపత్రి సిబ్బంది అడిగినంత లంచం ఇవ్వలేదనే కోపంతో, తాను ఆపరేషన్ చేసి అతికించిన కాలి ఎముకను తానే ఉద్దేశపూర్వకంగా విరగ్గొట్టి పైశాచిక ఆనందం పొందాడు. సభ్య సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యే ఈ ఘోర ఘటన ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్‌నగర్‌కు చెందిన రేష్మ అనే పేద మహిళకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. మానసిక స్థితి సరిగా లేని ఆ బాలికకు నెలన్నర కిందట ఎడమకాలి ఎముక విరగడంతో చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సర్జరీ కోసం ఆసుపత్రి సిబ్బంది రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బు లేకపోవడంతో రేష్మ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించి ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ, ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. చివరకు రేష్మ అతికష్టం మీద రూ. 8 వేలు చెల్లించడంతో డాక్టర్ చతుర్వేది అనే సర్జన్ ఆ చిన్నారికి ఆపరేషన్ పూర్తి చేశాడు.
ఆపరేషన్ ముగిసిన తర్వాత మిగతా డబ్బులు చెల్లించాలని, లేదంటే ఊరుకునేది లేదని సదరు డాక్టర్ గట్టిగా హెచ్చరించాడు. అయితే పేదరికం కారణంగా రేష్మ ఆ డబ్బును సమకూర్చలేకపోయింది. కొన్నాళ్ల తర్వాత పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ చతుర్వేది తన వికృత రూపాన్ని చూపించాడు. బాలిక కాలు నడవగలుగుతుందో లేదో పరీక్షిస్తానంటూ, ఆ చిన్నారి గట్టిగా అరుస్తున్నా వినకుండా కాలిని దారుణంగా మెలిపెట్టాడు. ఎముకను సరిచేస్తున్నానంటూ నమ్మబలికి, కక్షతో లోపల అతికించిన ఎముకను పక్కకు తిప్పి మళ్లీ విరిచేశాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ చిన్నారి నొప్పితో విలవిల్లాడటంతో, అనుమానం వచ్చిన తల్లి కుమార్తెను మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించింది. ఆ రిపోర్టులో ప్రభుత్వ డాక్టర్ చేసిన ఘోరం బయటపడింది. ఆపరేషన్ చేసి సరిచేసిన ఎముక మళ్లీ విరిగినట్లు వైద్యులు తేల్చారు. లంచం డబ్బులు ఇవ్వనందుకే డాక్టర్ చతుర్వేది కావాలనే కాలిని విరగ్గొట్టాడని తల్లి కన్నీరుమున్నీరైంది. దీనిపై బాధితులు నిరసనకు దిగడంతో ముజఫర్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సదరు వైద్యుడిపై తక్షణ విచారణకు ఆదేశించి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
